SIP vs RD: అనేక మంది ఉద్యోగులు తమకు వచ్చిన జీతంలో ఎంతో కొంత సేవ్ చేయాలని భావిస్తారు. అయితే ఇటీవల కాలంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) విధానం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతోపాటు పాత పద్ధతులైన రికరింగ్ డిపాజిట్ (RD) సేవింగ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ రెండింటిలో కూడా దేనిలో సేవింగ్ చేస్తే బెటర్, ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే పలు విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ముందుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) గురించి చూద్దాం. సిప్ అనేది మ్యూచువల్ ఫండ్ పథకంలో ఒక స్థిర మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే పెట్టుబడి ప్రణాళిక. SIPని తక్కువ మొత్తం నుంచి కూడా ప్రారంభించవచ్చు. SIPలు అనుకూలమైనవిగా ఉంటాయి. SIP ఈక్విటీలలో తక్కువ మొత్తంతో ఎక్కువ కాలం పెట్టుబడులు చేయడం ద్వారా పెద్ద మొత్తాలను పొందవచ్చు. అయితే దీనిలో మీరు ఆదా చేసే మొత్తాన్ని బట్టి మీ రాబడులు ఉంటాయి.
గత కొన్నాళ్లుగా ఉన్న సేవింగ్ స్కీంలలో బాగా ప్రాచుర్యం పొందిన వాటిలో రికరింగ్ డిపాజిట్ (RD) స్కీం కూడా ఒకటి. RD అనేది సాంప్రదాయ పెట్టుబడిదారులకు ఒక మంచి పెట్టుబడి విధానమని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో రిస్క్ దాదాపు ఉండదని చెప్పవచ్చు. మీరు చేసే పొదుపుపై స్థిర రాబడి మీకు లభిస్తుంది. మీరు క్రమం తప్పకుండా SIPలో పెట్టుబడి పెట్టినట్లే, RDలో కూడా క్రమం తప్పకుండా డిపాజిట్లు చేసి వడ్డీని పొందుతారు. మీ ఎంపికను బట్టి RD కాలపరిమితి 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రస్తుతం మీరు మీ పరిధిలోని బ్యాంకుల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో కూడా RDని తీసుకోవచ్చు. దీంతోపాటు మీ సమీప పోస్టాఫీసును సందర్శించి ఆఫ్‌లైన్‌లో కూడా దీనిని స్వీకరించవచ్చు.
రికరింగ్ డిపాజిట్ (RD)పై ప్రతి ఏడాది సాధారణ వడ్డీ రేటు 7% నుంచి 8% వరకు ఉంటుంది. కానీ ఈక్విటీ ఆధారిత పథకాలలో SIPలో ఏడాదికి సగటున 12% కంటే ఎక్కువ వడ్డీ రేటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి RDతోపాటు పోల్చితే సిప్ విధానంలో ఎక్కువ రాబడులు వస్తాయి. RDలో ఎంపికలు పరిమితంగా ఉంటాయి. మీరు స్థిర రాబడి లేదా సౌకర్యవంతమైన రాబడిని మాత్రమే ఎంచుకుంటారు, తర్వాత మార్చుకోలేరు.
కానీ మ్యూచువల్ ఫండ్ SIP విషయంలో అలా ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి దీనిలో ఎప్పటిప్పుడు మార్పులు చేసుకోవచ్చు. ఇక రిస్క్ గురించి మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్ SIPలో రిస్క్ ఉంటుంది. కానీ RDలో జీరో రిస్క్. RDలో నష్టాలు తక్కువగా ఉంటాయి. ఇక మ్యూచువల్ ఫండ్ సిప్ విషయంలో వడ్డీ రేటు రిస్క్, డిఫాల్ట్ రిస్క్, అస్థిరత మార్కెట్ వంటివి అనేక విధాలుగా రిస్క్ ఉంటుంది.
లిక్విడిటీ గురించి మాట్లాడుకుంటే, RDని ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు. కానీ దీనికి జరిమానా ఉంటుంది. ఇది రాబడిని తగ్గిస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ల విషయంలో మీ SIPని ఎప్పుడైనా తీసుకోవచ్చు, దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. మీరు ఒక నిర్దిష్ట సమయానికి ముందు ఉపసంహరించుకుంటే, నిష్క్రమణ జరిమానా వర్తిస్తుంది.
మాకు ఎలాంటి రిస్క్ వద్దు, స్థిరమైన రాబడి కావాలనుకున్న వారికి RDలు బెస్ట్ ఛాయిస్. లేదు మాకు మంచి రిటర్న్స్ కావాలి, రిస్క్ ఉన్నా పర్వాలేదు అనుకునేవారికి సిప్ విధానం మంచిది.