E-Paper
Advertisement

SIP, STP లేదా SWP… మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఏది ఉత్తమ మార్గం?

SIP, STP లేదా SWP… మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఏది ఉత్తమ మార్గం?
Advertisement

SIP vs STP vs SWP: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి అనగానే అందరికీ తెలిసిన ఒకే ఒక మంత్రం సిప్ (SIP). నెలనెలా చిన్న మొత్తాలతో మొదలుపెట్టి, భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవడానికి ఇది బెస్ట్ రూట్. అయితే మన జీవితంలో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితి ఉండదు కదా.. ఒక్కోసారి చేతిలోకి ఒకేసారి పెద్ద మొత్తం (లంప్‌సమ్) డబ్బు రావొచ్చు, మరికొన్నిసార్లు రిటైర్ అయ్యాక మన పొదుపు నుంచే ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు తీసుకోవాల్సి రావొచ్చు. సరిగ్గా అలాంటి సమయాల్లోనే STP, SWP అనే రెండు పవర్‌ఫుల్ టూల్స్ రంగంలోకి దిగుతాయి. స్టాక్ మార్కెట్ రిస్క్ తగ్గిస్తూ డబ్బును పెంచడం దగ్గర నుంచి, జీవితాంతం నెలవారీ ఆదాయం పొందడం వరకు ఇవి చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదు. SIP, STP, SWPలలో ఏది ఎలా పనిచేస్తుంది? మీ అవసరానికి ఏది కరెక్ట్ ఛాయిస్ అవుతుందో వివరంగా తెలుసుకుందాం.

నెలనెలా పెట్టుబడి పెట్టాలంటే SIP

SIP (సిప్) అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సులభంగా చెప్పాలంటే.. ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ తేదీన మీ బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని నేరుగా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ఒక స్మార్ట్ పద్ధతి ఇది. ఉదాహరణకు.. మీకు నెలకు రూ. 50,000 జీతం వస్తుందనుకుందాం. అందులో ప్రతి నెలా రూ. 5,000 చొప్పున ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న తేదీ రాగానే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి ఆ డబ్బు కట్ అయి, ఫండ్‌లో జమ అవుతుంది. ఇలా జేబుపై భారం పడకుండా చిన్న మొత్తాలతోనే మీ సంపద ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు. ఇక నెలనెలా జీతం అందుకునే ఉద్యోగులు, క్రమశిక్షణతో పొదుపు చేయాలనుకునే సామాన్యులకు SIP ఒక బెస్ట్ ఆప్షన్. అంతేకాదు స్టాక్ మార్కెట్ పెరిగినా, తగ్గినా మీరు క్రమం తప్పకుండా కట్టడం వల్ల.. తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు, ఎక్కువ ధర ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనే అవకాశం దొరికి లాంగ్ టర్మ్‌లో మంచి లాభాలు వస్తాయి.

చేతిలో పెద్ద మొత్తంలో డబ్బుంటే STP

Advertisement

STP (ఎస్‌టీపీ) అంటే సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. మీ చేతిలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పడినప్పుడు.. ఆ మొత్తాన్ని ఒకే దెబ్బకు స్టాక్ మార్కెట్ (ఈక్విటీ ఫండ్) లో వేసి రిస్క్ తీసుకోకుండా, కొద్దికొద్దిగా మెల్లగా మార్కెట్‌లోకి దించడానికి ఈ స్మార్ట్ ట్రిక్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు.. మీ దగ్గర ఒకేసారి రూ. 10 లక్షలు ఉన్నాయనుకుందాం. మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో అనే టెన్షన్‌తో ఆ మొత్తం డబ్బును ఒకేసారి ఈక్విటీ ఫండ్‌లో పెట్టడానికి మీరు భయపడుతూ ఉండచ్చు. అలాంటప్పుడు ముందుగా ఆ రూ. 10 లక్షలను తక్కువ రిస్క్ ఉండే ఒక లిక్విడ్ లేదా డెట్ ఫండ్‌లో వేసి, అక్కడి నుంచి ప్రతి నెలా రూ. 20,000 చొప్పున ఆటోమేటిక్‌గా ఈక్విటీ ఫండ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఒకేసారి కాకుండా విడతల వారీగా సేఫ్‌గా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి—డెట్ ఫండ్‌లో ఉన్న డబ్బుకు కూడా కొంత రిస్క్ ఉంటుంది, అలాగే STP ద్వారా ప్రతి నెలా డబ్బు ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మారడాన్ని ఒక రకంగా యూనిట్ల అమ్మకంగా పరిగణిస్తారు కాబట్టి దీనిపై ట్యాక్స్ (పన్ను) ప్రభావం కూడా పడే అవకాశం ఉంటుంది.

నెలనెలా డబ్బు కావాలంటే SWP

SWP (ఎస్‌డబ్ల్యూపీ) అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. ఇది సిప్ (SIP)కు అచ్చం రివర్స్‌లో పనిచేస్తుంది. SIPలో ప్రతి నెలా మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయి ఫండ్‌లోకి వెళ్తే.. SWPలో మాత్రం మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక ఫిక్స్‌డ్ మొత్తం నెలనెలా మన బ్యాంక్ ఖాతాలోకి వచ్చి పడుతుంది. ఉదాహరణకు.. రిటైర్మెంట్ తర్వాత మీ దగ్గర మ్యూచువల్ ఫండ్లలో రూ. 20 లక్షల ఫండ్ ఉందనుకుందాం. దాని నుంచి ప్రతి నెలా మీ ఖర్చుల కోసం రూ. 10,000 చొప్పున తీసుకునేలా SWP సెట్ చేసుకోవచ్చు. మీరు ఫిక్స్ చేసిన తేదీ రాగానే ఆ డబ్బు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో జమ అవుతుంది. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్లకు, తమ పొదుపు నుంచి నెలనెలా శాలరీ లాగా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వాళ్లకు ఇదొక సూపర్ ఆప్షన్.

మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి

Advertisement

మొత్తానికి ఈ మూడు పద్ధతుల్లో ఏ ఒక్కటే అందరికీ బెస్ట్ అని కచ్చితంగా చెప్పలేం.. అది పూర్తిగా మీ ఆర్థిక అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కొంత పక్కన పెడుతూ ఫండ్ ను నిర్మించుకోవాలంటే SIP, చేతిలో ఒకేసారి పెద్ద మొత్తం ఉండి మార్కెట్ రిస్క్ లేకుండా మెల్లగా స్టాక్స్‌లోకి వెళ్లాలంటే STP, ఇప్పటికే కూడబెట్టిన పెద్ద మొత్తం నుంచి నెలనెలా స్థిరమైన ఆదాయం తీసుకోవాలంటే SWP ఎంచుకోవాలి.  అయితే ఏ పద్ధతి ఎంచుకునే ముందైనా ఎక్కడ పెట్టాలి, పెట్టుబడి కాలం, రిస్క్ సామర్థ్యం, ట్యాక్స్ నిబంధనలను క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాతే అడుగు వేయడం మంచిది.

గుర్తుంచుకోవాల్సిన విషయం: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులకు (రిస్క్) లోబడి ఉంటాయి. SIP, STP, SWP పద్ధతులు లాభాలకు, అసలు డబ్బు భద్రతకు గ్యారెంటీ ఇవ్వవు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత పథకం పత్రాలను జాగ్రత్తగా చదవండి, అవసరమైతే సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.

Read Also: మీరు SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్… జర జాగ్రత్త

Related News

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా? UPI లేదా నగదుతో చెల్లించే ముందు ఈ రూల్స్ తెలుసుకోండి

రూ.99తో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. మార్కెట్లోకి వచ్చిన కొత్త కాంట్రా ఫండ్.. పూర్తి వివరాలివే

భార్యాభర్తలకు గుడ్ న్యూస్… 60 ఏళ్లు వచ్చాక నెలకు రూ.10000 పెన్షన్… ఈ స్కీమ్ గురించి తెలుసా?

సొంతింటి కల నెరవేర్చుకునే ఛాన్స్… 2029 వరకు కేంద్ర ప్రభుత్వ పథకంలో దరఖాస్తులు.. అర్హతలు ఇవే

లంచ్ బ్రేక్ స్కిప్.. గంట ముందే ఇంటికి.. ఉద్యోగికి కంపెనీ బిగ్ షాక్!

ఆన్‌లైన్‌లో ఇల్లు కొనాలని చూస్తున్నారా? బుక్ చేసే ముందు ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి

40 ఏళ్ల వయసులో రూ.3 కోట్ల రిటైర్మెంట్ ఫండ్… ప్రతి నెలా ఎంత SIP చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×