PAN Card Fraud: నేటి డిజిటల్ యుగంలో లోన్స్ తీసుకోవడం చాలా ఈజీగా మారిపోయింది. అనేక ఫీన్ టెక్ సంస్థలు క్షణాల్లోనే లోన్లను అందిస్తున్నాయి. ఇదే సమయంలో లోన్ ఫ్రాడ్ కేసులు, సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మీ పాన్ కార్డు వివరాలతో ఎవరైనా రహస్యంగా లోన్ తీసుకున్నారా. తీసుకుంటే దాని గురించి తెలుసుకోవడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పాన్ కార్డు
పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డు అనేది భారత ప్రభుత్వం జారీ చేసే 10 అంకెల గుర్తింపు సంఖ్య. ఇది ఆదాయపు పన్ను విభాగం ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. బ్యాంక్ అకౌంట్లు, లోన్‌లు తీసుకోవడం, ఆస్తుల కొనుగోలు వంటి ఆర్థిక కార్యకలాపాలకు పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. కానీ, ఈ కీలకమైన గుర్తింపు కార్డు సైబర్ నేరగాళ్ల దృష్టిలో పడితే, మీ ఆర్థిక భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రాజేష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రెడిట్ స్కోర్ ఆకస్మాత్తుగా పడిపోయినట్లు గమనించాడు. కారణం తెలుసుకునేందుకు తన క్రెడిట్ రిపోర్ట్ తనిఖీ చేయగా, తన పాన్ కార్డుతో రూ. 2 లక్షల లోన్ తీసుకున్నట్లు తెలిసింది. అసలు విషయం ఏటంటే రాజేష్ ఎప్పుడు కూడా ఆ లోన్ కోసం అప్లై చేయలేదు. కానీ పలు ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ద్వారా రాజేష్ తన వివరాలను నమోదు చేసిన క్రమంలో అవి దుర్వినియోగం అయ్యాయి. సైబర్ కేటుగాళ్లు ఆ వివరాలతో లోన్ తీసుకున్నారు.
మీ పాన్ కార్డుపై ఉన్న లోన్‌ను ఎలా చెక్ చేయాలి
మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి మీ క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయాలి. భారతదేశంలో నాలుగు ప్రధాన క్రెడిట్ బ్యూరోలు సిబిల్ స్కోర్ అందిస్తున్నాయి.
Read Also: Pickle Business: మహిళలకు బెస్ట్ బిజినెస్..నెలకు రూ.60 వేల …
సిబిల్
-సిబిల్ భారతదేశంలో అత్యంత ప్రముఖ క్రెడిట్ బ్యూరో. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేయడానికి క్రింది స్టెప్స్ పాటించండి
-ముందుగా సిబిల్ అధికారిక వెబ్‌సైట్ (www.cibil.com)ను ఓపెన్ చేయండి
-Get Your CIBIL Score ఆప్షన్ సెలక్ట్ చేయండి
-మీ పేరు, పాన్ కార్డు నంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ధృవీకరించండి
-మీ క్రెడిట్ రిపోర్ట్‌ను డాష్‌బోర్డ్‌లో యాక్సెస్ చేయండి, అక్కడ మీ పాన్ కార్డుతో అనుసంధానించబడిన అన్ని లోన్‌ల వివరాలు కనిపిస్తాయి.
-సిబిల్ ద్వారా సంవత్సరానికి ఒకసారి ఉచిత క్రెడిట్ రిపోర్ట్ పొందవచ్చు. అదనపు రిపోర్ట్‌ల కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది
ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్ హై మార్క్
సిబిల్‌తో పాటు, ఎక్స్‌పీరియన్ (www.experian.in), ఈక్విఫాక్స్ (www.equifax.co.in), సీఆర్ఐఎఫ్ హై మార్క్ (www.crifhighmark.com) వంటి ఇతర క్రెడిట్ బ్యూరోలు కూడా క్రెడిట్ రిపోర్ట్‌లను అందిస్తాయి. పై దశలను ఇక్కడ కూడా పాటించవచ్చు. ఈ బ్యూరోలు కూడా సంవత్సరానికి ఒక ఉచిత రిపోర్ట్ అందిస్తాయి.
ఫిన్‌టెక్ యాప్‌లు (PAN Card Fraud)
పేటీఎం, బ్యాంక్ బజార్, పైసా బజార్, క్రెడిట్‌మంత్రి వంటి ఫిన్‌టెక్ యాప్‌లు కూడా మీ పాన్ కార్డు వివరాలతో క్రెడిట్ స్కోర్, లోన్ వివరాలను త్వరగా చూపిస్తాయి. అయితే, ఈ యాప్‌లను ఉపయోగించే ముందు వాటి విశ్వసనీయత గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని యాప్‌లు మీ డేటాను దుర్వినియోగం చేస్తాయనే విషయాలు గుర్తుంచుకోవాలి.
ఫారం 26AS
ఆదాయపు పన్ను విభాగం అందించే ఫారం 26ASలో మీ పాన్ కార్డుతో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలు, అందులో లోన్‌లతో సహా, రికార్డ్ చేయబడతాయి. దీన్ని ఇన్‌కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్ (www.incometaxindiaefiling.gov.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ క్రెడిట్ హిస్టరిని తెలుసుకోవచ్చు.
లోన్ మోసం ఉంటే ఏం చేయాలి
-మీ క్రెడిట్ రిపోర్ట్‌లో మీరు దరఖాస్తు చేయని లోన్ కనిపిస్తే, వెంటనే క్రింది విషయాలను పాటించండి
-క్రెడిట్ బ్యూరోకు తెలియజేయండి: సిబిల్, ఎక్స్‌పీరియన్ లేదా సంబంధిత బ్యూరోకు ఫిర్యాదు చేసి, ఆ లోన్‌ను మీ రిపోర్ట్ నుంచి తొలగించమని కోరండి. వారు దానిని డిస్‌ప్యూట్ రిజల్యూషన్ ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తారు.
-లెండర్‌ను సంప్రదించండి: లోన్ జారీ చేసిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి, ఈ లోన్ మోసపూరితమని తెలియజేయండి. వారు దర్యాప్తు చేసి, లోన్‌ను మీ పేరు నుంచి తొలగిస్తారు.
-సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు: మీ స్థానిక సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. మీ పాన్ కార్డు, క్రెడిట్ రిపోర్ట్, ఇతర సంబంధిత ఆధారాలను అందించండి.