Airtel SpaceX: దేశంలో ఇంటర్ నెట్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇకపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్ స్టార్ లింక్ నెట్ సేవలు ఇండియాలో కొనసాగనున్నాయి. స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించడానికి భారతీ ఎయిర్‌టెల్‌తో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. భారతదేశంలో తన ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలను విక్రయించడానికి అవసరమైన అధికారాలను స్పేస్‌ఎక్స్ పొందడంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుంది.
ఈ భాగస్వామ్యం వల్ల భారతదేశంలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ రెండు కంపెనీలు కలిసి భారత్‌లో స్టార్‌లింక్ సేవలను అందించడానికి, వివిధ రంగాలలో మరిన్ని సేవలను అందించేందుకు కృషి చేయనున్నాయి.
ఈ ఒప్పందం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకే కాదు, వ్యాపార వర్గాలతోపాటు అనేక మందికి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ తన స్టోర్లలో స్టార్‌లింక్ పరికరాలను విక్రయించే అవకాశం ఉంది. దీంతోపాటు B2B (బిజినెస్ టు బిజినెస్) సేవలను కూడా అందించవచ్చు.
ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి మంచి అవకాశం ఉంటుంది. మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో కూడా స్టార్ లింక్ ఇంటర్ నెట్ సేవలను అందిస్తుంది. తద్వారా గ్రామాల్లో విద్య, ఆరోగ్య సేవలు, మరిన్ని అనేక విషయాల గురించి తెలుసుకునేందుకు ఎక్కువ సౌలభ్యం ఉంటుంది. దీంతో ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ సేవలు గ్రామీణ ప్రాంతాలలో పెద్ద మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది.
Read Also: Investment Tips: రోజు జస్ట్ రూ. 100 సేవింగ్.. కోటి రూపాయల రాబడి, ఎలాగంటే..
భారతదేశంలో ఎయిర్‌టెల్ కస్టమర్లకు స్టార్‌లింక్ సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేయడం ఒక కీలకమైన నిర్ణయమని ఎయిర్‌టెల్ ఎండీ, వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా ప్రపంచ స్థాయి హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్టార్‌లింక్ ద్వారా మేము మా కస్టమర్లకు నమ్మకమైన, సరసమైన ధరలకే ఇంటర్నెట్ సేవలను అందిస్తామన్నారు.
ఈ ఒప్పందంపై ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేయడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్ తెలిపారు. భారతీయ ప్రజలు, వ్యాపారాలు, కమ్యూనిటీలను అనుసంధానించడం ద్వారా స్టార్‌లింక్ విప్లవాత్మక మార్పును తీసుకురాగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రజలు కొత్త ఇంటర్ నెట్ వేగాన్ని పొందుతారని గ్విన్ షాట్‌వెల్ చెప్పారు.
భారతదేశంలో ఇంటర్ నెట్ సేవల విషయంలో ఈ భాగస్వామ్యం వచ్చే 2-3 సంవత్సరాల్లో అనేక మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు నెట్వర్క్ సేవలను అందిస్తూ, అనేక ప్రాంతాల్లో విస్తరించే ఛాన్సుంది.