Starlink: దేశంలో ఇంటర్నెట్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది స్టార్‌లింక్. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ సేవలకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ నుంచి లైసెన్స్ పొందింది. భారత మార్కెట్లోకి అడుగు పెట్టడమే మిగిలింది. మిగతా పనులు డిసెంబర్ లోపల పూర్తి చేయాలనే ఆలోచన చేస్తోందట ఆ కంపెనీ.
దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. డిసెంబర్ చివరినాటికి సేవలను ప్రారంభించాలని మస్క్ ఆలోచన చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో డిజిటల్ కనెక్టివిటీ ఆశయాలకు ఊతం ఇవ్వనుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్.. స్టార్‌లింక్ Gen1లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహ కూటమిని ఉపయోగించి ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి మార్గం సుగమమైంది.
న్యూఢిల్లీలోని మెస్సర్స్ స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది. స్టార్‌లింక్ జెన్1 కాన్స్టెలేషన్ సామర్థ్యాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు కానుంది. ప్రభుత్వ విభాగాల నుండి వచ్చే అన్ని సంబంధిత నియంత్రణ అనుమతులకు లోబడి లైసెన్స్ ఉంటుంది.
తొలుత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ పొందాలి. అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. తొలుత టెస్టింగ్, ట్రయల్స్ ద్వారా భద్రతా నిబంధనలను పాటిస్తున్నట్లు నిరూపించుకోవాలి. అప్పుడే ఈ సర్వీసులు దేశంలో మొదలవుతాయి. ఈ లెక్కన డిసెంబర్ చివరినాటికి పూర్తికావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ: ఖాతాదారులకు బ్యాంకులు శుభవార్త.. పెనాల్టీ భారం తప్పినట్టే
ఈ సేవలు భూకక్ష్యలో ఉన్న వేలాది ఉపగ్రహాల ద్వారా అందించబడతాయి. ఈ ఉపగ్రహాలు గ్రామీణ ప్రాంతాల సహా అందుబాటులో లేని ప్రదేశాలకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనుంది. గడిచిన మూడేళ్ల నుంచి ఇండియా మార్కెట్‌లో అడుగుపెట్టాలని స్టార్‌లింక్ భావిస్తోంది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందించాలనే లక్ష్యంతో అడుగుపెట్టింది.
స్టార్‌లింక్ ఉపగ్రహాలు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించనున్నాయి. వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అవసరాలకు ఉపయోగపడనుంది. ఇంటర్నెట్ సేవలు అందని మారుమూల గ్రామాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించనుంది. స్టార్‌లింక్ సేవలు ఉపగ్రహాలు, వాతావరణ పరిస్థితులపై తక్కువ ఆధారపడతాయి.
దీనివల్ల స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ వినియోగదారులకు లభించనుంది. స్టార్‌లింక్ కిట్‌ను సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదంటున్నారు. స్టార్‌లింక్ సేవల ద్వారా దేశంలో విద్య, వ్యాపారం, ఆరోగ్యం, వినోద రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకురావచ్చని భావిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఆన్‌లైన్ విద్య, ఆరోగ్య సంస్థలు టెలి మెడిసిన్ సేవలకు స్టార్‌లింక్ సేవలు ఉపయోగించే అవకాశముంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అవకాశముంది. స్టార్‌లింక్ సేవల ధరల్లో అందుబాటులో ఉంటాయా? అన్నదే పెద్ద ప్రశ్న.
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ 3 వేల నుంచి 4 వేల వరకు ఉండొచ్చని అంచనా. కాకపోతే అసలు చిక్కంతా స్టార్‌లింక్ కిట్. దీని ధర భారత్‌లో 33 వేల ఉండొచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కిట్ లేకుంటే సేవలు పొందడం కష్టం. దేశంలో శాటిలైట్ సేవలు అందించడం కోసం జియో, ఎయిర్‌టెల్‌తో స్టార్‌లింక్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెల్సిందే.