Stock Markets: భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో మొదటిరోజైన సోమవారం (మార్చి 3న) కూడా నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు మొదట గ్రీన్ లో మొదలై, తర్వాత తిరిగి రెడ్ జోన్‌లోకి జారిపోయాయి. ప్రపంచ మార్కెట్లలో బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు మార్కెట్లో భయాందోళనలు సృష్టించాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 112 పాయింట్లకు పైగా తగ్గి 73,085 స్థాయిలో ముగియగా, నిఫ్టీ 6 పాయింట్లు తగ్గిపోయి 22,119 పరిధిలో ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 48,114 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 69 పాయింట్లు పెరిగి పాజివ్ ధోరణిలో ఉండటం విశేషం. ఈ క్రమంలో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా నష్టపోయారు.
ఈ క్రమంలో ప్రస్తుతం కోల్ ఇండియా, రిలయన్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా.. భారత్ ఎలక్ట్రానిక్స్, గ్రాసిమ్, ఐచర్ మోటార్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బీపీసీఎల్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో 6 శాతం పడిపోయాయి.
Read Also: Xiaomi 15: షియోమీ 15 అల్ట్రా రిలీజ్ డేట్ ఫిక్స్.. 200MP కెమెరాతోపాటు మరిన్ని ఫీచర్లు..
ఇక అంతర్జాతీయ మార్కెట్ల గురించి చూస్తే జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.67 శాతం పెరగగా, టాపిక్స్ ఇండెక్స్ 0.75 శాతం లాభపడింది. ఆస్ట్రేలియా ASX 200 ఇండెక్స్ కూడా 0.22 శాతం లాభంతో ట్రేడవుతోంది. సెలవుదినం కారణంగా దక్షిణ కొరియా మార్కెట్లు మూసివేయబడ్డాయి. అమెరికా మార్కెట్లు కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. ఎస్ అండ్ పీ 500 1.59 శాతం, డౌ జోన్స్ 1.39 శాతం, నాస్డాక్ 1.63 శాతం పెరిగాయి.
ఫిబ్రవరి తయారీ PMI డేటా మూడో త్రైమాసిక GDP డేటా, విదేశీ పెట్టుబడిదారుల (FIIs) కార్యకలాపాలు మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి. అయితే ఈ వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించనున్న కొత్త సుంకాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా ఫోకస్ చేశారు. శుక్రవారం సెషన్ ప్రారంభంలో సెన్సెక్స్ ఏకంగా 1,414 పాయింట్లు తగ్గి 73,198 వద్ద ముగిసింది. నిఫ్టీ 420 పాయింట్లు పడిపోయి 22,125 వద్ద ముగిసింది.
భారతీయ స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీ అమ్మకాలకు గురయ్యాయి. దీంతో ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి దీని విలువలు పడిపోయాయి. BSE సెన్సెక్స్ (P/E) నిష్పత్తి శుక్రవారం 20.4xకి పడిపోయింది. ఇది మే 2020 తర్వాత అత్యల్ప స్థాయి. అంతకుముందు కరోనా సమయంలో మార్కెట్ పతనం కారణంగా ఇది 19.5xకి చేరుకుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల ఆందోళనలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ఆర్థిక పరిస్థితులు సహా పలు అంశాలు ఉన్నాయని అంటున్నారు.