CJ Roy Tragic Death: చిరియాంకందత్ జోసెఫ్ ఈ పేరుతో పిలిస్తే కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, సీజే రాయ్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. కారణం, ఆయన పేరు ఒక బ్రాండ్. చిరు ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆయన, అకుంఠిత శ్రమతో ప్రగతి సాధించారు. కాన్ఫిడెంట్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి, నెమ్మదిగా ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజుగా కొనసాగారు. తను అడుగు పెట్టిన అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యారు. సినిమా రంగం నుంచి మీడియా రంగం వరకు అన్నింటా విజేత అనిపించుకున్నారు. కాన్ఫిడెంట్ సంస్థను ఎంతో కాన్ఫిడెంట్ గా సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించిన ఆయన చివరకు అదే కాన్ఫిడెన్స్ కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆఫీస్ లోనే రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. అగ్ర వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎందుకు అర్థాంతరంగా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి.
సీజే రాయ్ తన వ్యాపార విజయాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోలేదు. తన లగ్జరీ లైఫ్ ను ఎప్పుడూ బయటకు చూపించేవారు. లగ్జరీ కార్లు, ఇంద్రభవనం లాంటి బంగళా, సొంత హెలికాఫ్టర్.. సోషల్ మీడియాలో తన ఆడంబరతను ప్రపంచానికి చాటిచెప్పేవారు. ఎప్పుడూ హ్యాపీగా కనిపించే రాయ్.. చనిపోయిన తర్వాత, ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు వ్యవస్థలోని డార్క్ షేడ్స్ ను బయటపెడుతున్నాయి. రాయ్ కి ఎలాంటి అప్పులు లేవు. వ్యాపారాల్లో సమస్యలూ లేవు. ఆయన చనిపోవడానికి కారణం కేవలం ఐటీ అధికారుల వేధింపులు మాత్రమే అని ఆయన సోదరుడు కుండబద్దలు కొట్టారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే రాయ్ ని అధికారులు విచారణ పేరుతో నిరంతరం వేధించారని ఆరోపించారు. చట్టం చాటున తనపైనా, తన కుటుంబ సభ్యుల పైనా అధికారులు పాల్పడ్డ వేధింపులే ఆయనలో కాన్ఫిడెన్స్ పోయేలా చేశాయన్నారు. విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న వ్యాపారవేత్తను ఆత్మహత్యకు పురిగొల్పేలా చేశాయన్నారు.
వాస్తవానికి రాయ్ తన విజయాలను ఏనాడు గోప్యంగా ఉంచలేదు. తన సక్సెస్ ను ప్రదర్శించేందుకు వెనుకాడేవారు కాదు. అదే, ఆయన ఆత్మహత్యకు కారణం అయ్యిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. లగ్జరీ జీవన విధానం, హైఫై ఈవెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మీద ఐటీ అధికారులు దృష్టిపెట్టేలా చేసింది. తమ సంపాదనకు సంబంధించి ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారు. కానీ, అధికారులు విచారణల పేరుతో నిత్యం ఆయనకు వేధింపులు తప్పలేదు. తనిఖీలు, విచారణల పేరుతో హింసించడాన్ని ఆయన ఓ అవమానంగా భావించారు. ఇంతకాలం వ్యాపార దిగ్గజంగా కొనసాగిన తనను వేధించాన్ని తట్టుకోలేకపోయారు. చివరకు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లారు. అధికారులు చట్టం పరిధి మేరకు పని చేస్తే ఫర్వాలేదు, పరిధి దాటి ముందుకు వెళ్లినప్పుడే ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. వ్యవస్థలు వైఫల్యం చెందుతాయి.
రాయ్ ఇండియాలోని అగ్ర వ్యాపారులలో ఒకరుగా కొనసాగుతున్నారు. ఆయన మరణం చాలా మంది వ్యాపారవేత్తలలో అభద్రతా భావాన్ని కలిగిస్తుందని చెప్పకతప్పదు. ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని ఏమీ చేయలేకపోతున్న వ్యవస్థలు.. ఓ కాఫీ డే సిద్ధార్థ్, ఓ కాన్ఫిడెంట్ అధినేత సీజే రాయ్ లాంటి వారిని వేధించి వేధించి ప్రాణాలు తీస్తున్నాయి. వాస్తవానికి కాఫీ డే సిద్ధార్థ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. విచారణ పేరుతో ఐటీ అధికారులు ఆయన ఆర్థిక వ్యవస్థ స్తంభింపజేసి, చేతిలో చిల్లిగవ్వలేని వ్యక్తిగా మార్చి, చివరకు ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లేలా మానసికంగా కుంగదీశారు. ఇప్పుడు రాయ్ విషయంలోనూ అచ్చంగా అలాగే జరిగిందని చెప్పక తప్పదు. ఇప్పటికైనా వ్యవస్థలు పరిధికి మించి అతి చేయడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థల తీరుపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితిని నొక్కి వక్కాణిస్తున్నాయి.