Vehicle drive without a driving license: దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ నింబధనలు కఠినతరం చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే రూ. 5,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాన్స్ పోర్టు వాహనాలకూ వర్తిస్తుంది. ఈ నిబంధనలు ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని రకాల వాహనాలకు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నిబంధన వర్తించదు.
షరతులతో కూడిన మినహాయింపు
భారత ప్రభుత్వం దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, ఉద్గారాలు లేని రవాణాను ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల(EVలు) వినియోగాన్ని ఎంకరేజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. అంటే.. ఈవీలు నడిపే వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఫర్వాలేదన్న మాట. అయితే, ఈ మినహాయింపు కొన్ని షరతలుతో కూడుకుని ఉన్నది.
ఇంతకీ ఆ షరతులు ఏంటంటే?
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం, గంటకు గరిష్టంగా 25 కి.మీ వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ టూవీలర్స్ కు డ్రైవింగ్ లైసెన్స్, బైక్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అంటే ఈ స్పీడ్ లిమిట్ పరిధిలోకి వచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ను మీరు కలిగి ఉంటే, లేదంటే మీరు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపవచ్చు. అంతేకాదు, సంప్రదాయ ద్విచక్ర వాహనాల మాదిరిగానే రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్ అనేది తప్పనిసరి కాదు.
Also Read: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?
స్థానిక RTO నిబంధనలు..
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నింబధనలు తీసుకొచినప్పటికీ, నిర్దిష్ట నియమాలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. ప్రతి రాష్ట్రం లేదంటే స్థానిక అధికార పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సంబంధించి కొన్ని కొన్ని నిబంధనలు మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. అన్ని టూవీలర్స్ కు వాటి వేగం, మోడల్ తో సంబంధం లేకుండా, ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి. రోడ్లపై చట్టబద్ధంగా నడపడానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఉండాలి. నిర్దిష్ట పరిస్థితులలో లైసెన్స్ లేకుండా కొన్ని ఎలక్ట్రిక్ టూవీలర్స్ ను నడపడానికి అనుమతించబడినప్పటికీ, మీ వాహనం జాతీయ, స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం మంచిది. జరిమానాలు, చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు అవసరమైన నింబధనలు ఫాలో కావడం ఉత్తమం.