Today Gold Rate: బంగారం రేట్లు అప్పుడే భగ్గమంటున్నాయి.. అప్పుడే తగ్గుతున్నాయి. మార్కెట్లలో అనిశ్చితితో ఏ రోజు రేటు ఎలా ఉంటుందో చెప్పలేని సిచ్యువేషన్ కు చేరింది. తగ్గితే ఒకే రోజు వేలల్లో తగ్గుతోంది. పెరిగినా కూడా అలాగే జరుగుతోంది. అప్పుడే తగ్గిందని సంతోషపడేలోపు పెరిగింది. ఆ వెంటనే తగ్గుతోంది? ఎప్పుడూ లేనట్లుగా బులియన్ మార్కెట్లో ఎందుకీ పరిస్థితి?
గతంలో ఎప్పుడూ లేనట్లుగా బులియన్ మార్కెట్ షేక్ అవుతోంది. ఏ రోజు ఏ రేటు ఉంటుందో ఎక్స్ పర్ట్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయలేనంతగా మారుతోంది. ఈ రోజు ఉన్న రేటు, రేపు ఉండడం లేదు. రేపటి రేటు ఎల్లుండి ఉండడం లేదు. తులం బంగారం తగ్గితే వేలల్లో తగ్గుతోంది. పెరిగితే కూడా వేలల్లో పెరుగుతోంది. అదీ పరిస్థితి ఎందుకిలా?
ఒక దశలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయల మార్క్ తాకింది. ఇది ఆల్ టైమ్ హై. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య యుద్ధాలు, మార్కెట్లలో అనిశ్చితితో అంతా గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపడంతో కథ అలా మారిపోయింది. కానీ ఇప్పుడు క్రమంగా బంగారం దిగి వస్తోంది. అమెరికా చైనా మధ్య టారిఫ్ యుద్ధానికి తెరపడటం, ఉక్రెయిన్-రష్యా, భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ పరిస్థితులు చల్లబడడంతో కథ మారిపోతోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు మేలిమి బంగారం ధర 100 డాలర్లకు పైగా తగ్గి 3160 డాలర్ల వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు 89,400 రూపాయలు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 97,530 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర రూ. 1,11,000 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ.1,00,000 వేల రూపాయలుగా ఉంది.
కాబట్టి హెచ్చుతగ్గులైతే కనిపిస్తున్నాయి. ఇదంతా మార్కెట్ల మహిమే. ఎందుకంటే ఇన్వెస్టర్లు సేఫ్టీగా భావించే గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ నుంచి బయటికొచ్చి రిస్కు తీసుకుంటుండడంతో బంగారం రేట్లు తగ్గుతున్నాయి. మళ్లీ ఏదైనా వాణిజ్య అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే కథ మొదటికే రావడం ఖాయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. 90 రోజుల పాటు సుంకాలను తగ్గించడానికి అమెరికా, చైనా ఒప్పుకోవడం వాణిజ్య యుద్ధం భయాలను తగ్గించింది. అనిశ్చితి తగ్గుతున్న కొద్దీ, పెట్టుబడిదారులు రిస్కు ఉండే ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. ఫలితంగా గోల్డ్ రేట్ దిగి వస్తోంది.
Also Read: కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా ఉద్యోగం మానేస్తే జరిమానా తప్పదు.. సుప్రీం కోర్టు తీర్పు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఏప్రిల్‌లో ఔన్సు 3500 డాలర్ల వరకు వెళ్లింది. అప్పుడు దేశీయంగా లక్ష రూపాయలు మార్కు దాటిన పసిడి.. ఇప్పుడు 7 వేల నుంచి 8 వేల రూపాయల దాకా తగ్గింది. అంతటా ఉద్రిక్తతలు చల్లారడంతో రిస్క్ ఉన్న ఇన్వెస్ట్ మెంట్స్ వైపు మదుపర్లు మొగ్గుచూపడంతో బంగారం ధర దిగి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గుతోంది. బంగారం ధరలు రిటైల్ మార్కెట్లో తగ్గడానికి కాస్త సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్ తో పోల్చి చూస్తే రిటైల్ మార్కెట్లో కాస్త నెమ్మదిగా బంగారం ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు 90 రోజుల పాటు బ్రేక్ పడింది. ఆ తర్వాత కూడా అవే టారిఫ్ లు కంటిన్యూ అయితే గనుక తులం బంగారం 80 వేల దాకా దిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.