Tourist Places Near Tirupati: తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నిత్యం ఈ ఆలయానికి లక్షలాధి మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇదిలా ఉంటే తిరుపతికి వచ్చిన వారు చూడటానికి సమీపంలో 50 కిలోమీటర్ల పరిధిలోనే అనేక ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక, సహజసిద్ధమైన, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా ఈ ప్రదేశాలు యాత్రికులకు, పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి సమీపంలోని కొన్ని ముఖ్యమైన పర్యాటక స్థలాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.శ్రీకాళహస్తి ఆలయం:
తిరుపతి నుండి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇక్కడ శివుడు వాయు లింగం రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం దాని పురాతన నిర్మాణం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. రాహు-కేతు పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. జాతక దోషాలను నివారించడానికి నిత్యం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆలయం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను జోడిస్తోంది.
2. శిలాతోరణం:
తిరుమలలోని తిరుపతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలాతోరణం ఒక సహజ రాతి ఆర్చ్. ఇది భూగర్భ శాస్త్రపరంగా అరుదైన నిర్మాణం. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక, సహజ సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది తిరుమల కొండలలో ఒక పవిత్ర స్థలంగా భావించబడుతుంది. ఈ రాతి ఆర్చ్‌ను చూసేందుకు పర్యాటకులు చాలా మంది నిత్యం ఇక్కడికి వస్తుంటారు. అంతే కాకుండా ఇక్కడ సమీపంలోని గార్డెన్ ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.
3. పాపవినాశనం తీర్థం:
తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపవినాశనం తీర్థం ఒక పవిత్ర జలపాతం. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతారు. ఈ ప్రదేశం సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది.ఈ జలపాతం చుట్టూ ఉన్న పచ్చని అడవులు పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తాయి.
4. చంద్రగిరి కోట:
తిరుపతి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి కోట చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన ఈ కోట.. దాని అద్భుతమైన నిర్మాణం, చారిత్రక విశేషాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. కోటలోని రాజా , రాణీ మహల్‌లు, అలాగే సాయంకాలం జరిగే లైట్ అండ్ సౌండ్ షో, పర్యాటకులను తెగ ఆకర్షిస్తోంది.
5. శ్రీవారి పాదాలు:
తిరుమలలోని శ్రీవారి పాదాలు తిరుపతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్ర స్థలం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి పాదముద్రలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు.. కొండల మధ్య సహజ సౌందర్యాన్ని కూడా అందిస్తుంది.
6.డీర్ పార్క్:
తిరుపతి సమీపంలో ఉన్న డీర్ పార్క్, ప్రకృతి ప్రేమికులకు ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. ఇక్కడ జింకలు , ఇతర చిన్న జంతువులను మీరు చూడొచ్చు. కుటుంబ సమేతంగా సందర్శించేందుకు ఇది అనువైన స్థలం. అంతే కాకుండా పిల్లలకు ఈ ప్రదేశం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
Also Read: ఏపీలో అందమైన బీచ్‌లు ఇవే.. అస్సలు మిస్సవ్వొద్దు !
7.ఆకాశగంగ జలపాతం:
తిరుమలలోని ఆకాశగంగ జలపాతం తిరుపతి నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు సహజ సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. ఈ జలపాతంలోని నీరు శ్రీ వేంకటేశ్వర స్వామి అభిషేకానికి ఉపయోగించబడుతుందని చెబుతారు. పర్యాటకులు ఇక్కడ స్నానం చేయడం, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వస్తుంటారు.
తిరుపతి సమీపంలోని ఈ పర్యాటక స్థలాలు ఆధ్యాత్మికత, సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒక రోజు లేదా రెండు రోజుల యాత్రకు అనువైనవి. కానీ భక్తులు, పర్యాటకులకు మరపురాని అనుభవాన్ని అందిస్తాయి. తిరుపతి వెళ్లినప్పుడు ఈ స్థలాలను తప్పక చూడండి.