How to overcome stage fear| స్టేజ్‌పైకి వెళ్లగానే ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, మాటలు మర్చిపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ప్రెజెంటేషన్ కోసం ఎంత బాగా సిద్ధమైనా, ఆడియన్స్ ముందు మాట్లాడేటప్పుడు కొందరు భయపడుతుంటారు. దీన్నే స్టేజ్ ఫియర్ లేదా పబ్లిక్ స్పీకింగ్ నర్వస్‌నెస్ అంటారు. అయితే, కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తూ క్రమంగా ప్రాక్టీస్ చేస్తే ఈ భయాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
ఈ రోజుల్లో పబ్లిక్ స్పీకింగ్ ఒక ముఖ్యమైన నైపుణ్యంగా మారింది. విద్యార్థులు.. క్లాస్‌రూంలో, సెమినార్లు, యూనివర్సిటీ కార్యక్రమాల్లో ప్రెజెంటేషన్లు ఇస్తుంటారు. ఉద్యోగులు కూడా మీటింగ్స్, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లలో మాట్లాడాల్సి వస్తుంది.
చాలామంది ప్రెజెంటేషన్‌కు ముందుగానే బాగా సిద్ధమవుతారు. అయినప్పటికీ, స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కొన్ని విషయాలు మర్చిపోతారు. సరైన పదాలు గుర్తుకు రాకపోవడంతో తడబడుతూ మాట్లాడుతారు. కొందరికి చేతులు వణకడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి అనుభవాలను స్టేజ్ ఫియర్‌తో సంబంధం ఉన్న నర్వస్‌నెస్‌గా చూడవచ్చు. అయితే, ప్రాక్టీస్‌తో సాధనతో పబ్లిక్ స్పీకింగ్‌ను క్రమంగా మెరుగుపరచుకోవచ్చు.
ప్రెజెంటేషన్‌ను ప్రేక్షకుల ముందు చెప్పే ముందు పలుమార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి వాక్యాన్ని గుర్తు పెట్టుకోవడం కంటే ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవాలి. తరచుగా సాధన చేస్తే విషయాలు సహజంగా గుర్తుకు వస్తాయి. మాట్లాడేటప్పుడు సరైన పదాలను వెతకడం కూడా సులభమవుతుంది. దీంతో గందరగోళం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మీ వంతు దగ్గరపడే కొద్దీ టెన్షన్ పెరగవచ్చు. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా కండరాలు బిగుసుకుపోవడం అనిపించవచ్చు. అలాంటి సమయంలో నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. ప్రెజెంటేషన్ కొద్దిసేపట్లో పూర్తవుతుందని మీకు మీరు గుర్తుచేసుకోవాలి. తప్పుల గురించి ఆలోచించకుండా చెప్పాల్సిన విషయాలపై దృష్టి పెట్టాలి. డీప్ బ్రీతింగ్ అంటే లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
స్టేజ్‌పైకి వెళ్లే ముందు సన్నిహితమైన వ్యక్తితో మాట్లాడాలి. మీకు ధైర్యం చెప్పే స్నేహితుడితో మాట్లాడటం కొంత ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రెజెంటేషన్‌కు ముందు కొత్త విషయాలను బలవంతంగా గుర్తుపెట్టుకోవద్దు. చివరి నిమిషంలో ఎక్కువగా చదవడం బదులు కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇతరులు ఇచ్చే ప్రెజెంటేషన్లను కూడా శ్రద్ధగా వినాలి. వారి మాట్లాడే విధానం నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవాలి.
ఇతరులు తమ విషయాలను ఎలా వివరిస్తున్నారో గమనించాలి. వారు ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తున్నారో కూడా పరిశీలించాలి. ఇలా గమనించడం ద్వారా మీలో ఉన్న లోపాలను గుర్తించాలి. భవిష్యత్తులో ప్రెజెంటేషన్లను మరింత సమర్థంవంతంగా నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది.
Also Read: ఉద్యోగం చేసే మహిళలకు 10 మినిట్ మేకప్ టిప్స్.. ఆఫీస్ నుంచి పార్టీకి నిమిషాల్లో రెడీ
అద్దం ముందు నిలబడి మొత్తం ప్రెజెంటేషన్‌ను చెప్పి చూడాలి. మీ ముఖ కవళికలు, చేతుల కదలికలు, నిలబడే విధానాన్ని గమనించాలి. మీరు పదేపదే చేసే కొన్ని తప్పులను ఇలా గుర్తించుకోండి.. అలాగే, మీ గొంతును మీరే స్వయంగా వినడం కూడా అలవాటవుతుంది.
Also Read: 8 ఏళ్లుగా ఉద్యోగం లేదు.. 3 సార్లు యుపిఎస్‌సి పరీక్షలు ఫెయిల్.. కట్ చేస్తే రూ.17 లక్షల సాలరీ ఉద్యోగం
సరైన ప్రిపరేషన్ లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ కష్టంగా అనిపిస్తుంది. కంటెంట్‌పై స్పష్టత లేకపోయినా టెన్షన్ పెరుగుతుంది. అందుకే ముందుగానే సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలి. ముఖ్యమైన అంశాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలి. రాసుకున్న నోట్స్‌పై పూర్తిగా ఆధారపడకుండా మాట్లాడేలా సాధన చేయాలి. ప్రాక్టీస్, మంచి ప్రిపరేషన్, శ్వాస నియంత్రణతో స్టేజ్ ఫియర్‌ను క్రమంగా తగ్గించుకోవచ్చు. పబ్లిక్ స్పీకింగ్‌పై భయం ఉన్నా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నిరంతర సాధనతో స్టేజ్‌పై మరింత ప్రశాంతంగా, నమ్మకంగా మాట్లాడటం నేర్చుకోవచ్చు.