1 CR Loan For Women: భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు ఇటీవల బిజినెస్ ప్రారంభించేలా పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. అయితే కోలేటరల్ (హామీ) లేకుండా పెద్ద మొత్తంలో లోన్ పొందడం ఇంకా చాలామందికి సవాలుగా మారుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం, కొన్ని బ్యాంకులు కలిసి కొన్ని ప్రత్యేకమైన స్కీమ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి ద్వారా రూ.1 కోటి వరకు బిజినెస్ లోన్‌ను మహిళలు ఏ హామీ లేకుండానే పొందే అవకాశం కల్పించారు.
మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లోన్..
ఈ దిశగా మొదటగా చెప్పుకోవాల్సినది “స్టాండ్ అప్ ఇండియా (Stand-Up India)” పథకం. ఇది గ్రీన్‌ఫీల్డ్ బిజినెస్‌లు ప్రారంభించాలనుకునే మహిళలకు ప్రత్యేకంగా రూపొందించబడినది. మాన్యుఫాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసుల రంగాల్లో కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లోన్ లభిస్తుంది. ఈ లోన్‌కు కొంతమేర వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. సాధారణంగా ఈ లోన్లకు వడ్డీ రేటు బ్యాంక్ ఆధారంగా 7 నుంచి 8.5 శాతం మధ్య ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ లోన్ కోసం మీరు ఏమైనా ఆస్తి లేదా భూమిని హామీగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ లోన్లను “Credit Guarantee Scheme” కింద కవర్ చేస్తారు.
ఇక ఇంకొక ముఖ్యమైన అంశం “CGTMSE” అంటే “Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises.” దీని ద్వారా బ్యాంకులు మహిళలకోసం రూ.1 కోటి వరకూ లోన్ ఇవ్వగలుగుతాయి. అదీ కూడా ఆస్తి లేదా భూమిని హామీగా లేకుండానే. ఈ స్కీమ్‌లో లోన్ మొత్తానికి 75 శాతం నుండి 85 శాతం వరకు ప్రభుత్వ భరోసా ఉంటుంది. అంటే, మీరు డిఫాల్ట్ అయితే ఆ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. దీని వల్ల బ్యాంకులు కూడా రిస్క్ లేకుండా ఆమోదించగలుగుతాయి. ఈ CGTMSE ఆధారిత లోన్లకు సాధారణంగా వడ్డీ రేటు 8 శాతం నుండి 11 శాతం మధ్య ఉంటుంది.
వడ్డీ ఎంతంటే..
మరోవైపు కొన్ని ప్రభుత్వ బ్యాంకులు కూడా మహిళల కోసం ప్రత్యేకంగా లోన్ పథకాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న “Cent Kalyani Scheme” మహిళా వ్యాపారులకు తక్కువ వడ్డీతో లోన్ ఇస్తుంది. ఈ లోన్‌కు సుమారు 7.6 శాతం నుండి 9 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంక్ ఆధారంగా ఇది మారవచ్చు. ఈ స్కీమ్‌కి కూడా ఆస్తి లేదా భూమి హామీ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది CGTMSE ద్వారా కవర్ అవుతుంది.
ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి గతంలో అమలులో ఉన్న “Dena Shakti Scheme” కూడా మహిళలకు తక్కువ మొత్తాల లోన్ అందించేది. దీని ప్రత్యేకత ఏమిటంటే – సాధారణ వడ్డీ రేటుతో పోల్చితే 0.25 శాతం తక్కువ వడ్డీతో ఈ లోన్ అందేది. అయితే ఈ స్కీమ్ ప్రస్తుతం విలీనమైనది గనుక ప్రస్తుత కాలంలో ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోవచ్చు.
మొత్తానికి చెప్పాలంటే, భారతదేశంలో మహిళలు ఆస్తి లేదా భూమిని హామీగా లేకుండా రూ.1 కోటి వరకు బిజినెస్ లోన్ పొందటం ఇప్పుడు సాధ్యమే. కానీ దానికోసం మంచి బిజినెస్ ప్లాన్ ఉండాలి, అలాగే అర్హత ప్రమాణాలను కూడా పాటించాలి. బ్యాంకులలో కన్సల్ట్ చేయడం లేదా అధికారిక ప్రభుత్వ పోర్టళ్లలో అప్లై చేయడం ద్వారా ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చు. అయితే ప్రతి బ్యాంకు నిబంధనలు, వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. కనుక అప్లై చేసేముందు అధికారిక వెబ్‌సైట్లలో పూర్తిగా వివరాలు చదవడం మంచిది.