Zepto Delivery: క్విక్ కామర్స్ దిగ్గజం ‘జెప్టో’ తన కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ఉచిత డెలివరీ కోసం నిర్ధేశించిన కనీస ఆర్డర్ విలువను అమాంతం పెంచేసింది. ఇన్నాళ్లు రూ. 149గా ఉన్న ఈ పరిమితిని రూ. 199కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్లింకిట్ (Blinkit), ఇన్ స్టా మార్ట్ (Instamart) వంటి సంస్థలు మినిమమ్ ఆర్డర్ రూ.199 చేయగా తాజాగా వాటి సరసన జెప్టో చేరడం గమనార్హం.
మరోవైపు రద్దీ, డిమాండ్ ను బట్టి కనీస ఆర్డర్ విలువ మరింత పెరగనున్నట్లు సమాచారం. రూ.199 నుంచి రూ.299 చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పరిమితి రూ. 99గా ఉండేది. ఆ తర్వాత దాన్ని రూ. 149కి పెంచిన జెప్టో.. తాజాగా మళ్లీ రూ. 199కి పెంచి కస్టమర్లకు షాకిచ్చింది. నష్టాలను తగ్గించుకునే క్రమంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని కొటాక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన నివేదికలో పేర్కొంది.
ఇదిలా ఉంటే జెప్టో వంటి క్విక్ కామర్స్ కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడంపై గత కొంతకాలంపై దృష్టి సారించాయి. డెలివరీ వ్యయాలు, వినియోగదారుల డిమాండ్ మధ్య సమతుల్యత పాటిస్తూ ప్రతి ఆర్డర్ పై గరిష్ట లాభం పొందేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే కనీస ఆర్డర్ విలువను రూ.199కి పెంచుతూ జెప్టో నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉచిత డెలివరీ పరిమితిని పెంచడం వల్ల కస్టమర్లు ఎక్కువ వస్తువులను కార్ట్‌లో జోడించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కస్టమర్ల సగటు ఆర్డర్ విలువ పెరిగి.. చిన్న చిన్న ఆర్డర్ల నుంచి కూడా కంపెనీకి లాభసాటి ఆదాయం లభిస్తుందని తెలియజేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల చిన్న తరహా ఆర్డర్లు పెట్టే వినియోగదారులు కొంత వెనకడుగు వేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటున్నారు. సాధారణంగా ఒకటి రెండు అత్యవసర వస్తువుల కోసం క్విక్ కామర్స్ యాప్‌లను వాడేవారు.. ఎక్కువ పరిమితి చూడగానే ఆర్డర్ చేయడాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read: లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి
ఇదిలా ఉంటే క్విక్ కామర్స్ సంస్థలే కాకుండా ఫుడ్ డెలివరీ రంగానికి సంబంధించి కూడా ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది మార్చిలోనే జొమాటో తన ప్లాట్‌ఫారమ్ రుసుమును దాదాపు 19 శాతం (రూ. 2.40 మేర) పెంచింది. జీఎస్‌టీకి ముందు వరకు ఈ ఛార్జీ ఆర్డర్‌కు రూ. 12.50 ఉండగా.. దాన్ని రూ. 14.90 కి జొమాటో పెంచింది. ఆ వెంటనే జొమాటోను అనుసరిస్తూ స్విగ్గీ కూడా తన ప్లాట్‌ఫారమ్ ఛార్జీని 17 శాతం మేర పెంచింది. జీఎస్‌టీతో కలిపి గతంలో రూ. 14.99 గా ఉన్న రుసుమును రూ. 17.58 (రూ. 2.59 పెంపు)కి పెంచినట్లు స్విగ్గీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: పైసా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్.. Jio, Airtel, Vi లో.. చౌకైన ఓటీటీ ప్లాన్స్ ఇవే!