Hyderabad: తెలంగాణలో మందుబాబులకు బిగ్ అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా బార్లు-రెస్టారెంట్లు మూతపడనున్నాయి. కొత్త పన్ను కారణంగా తమకు తీవ్రమైన నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా బార్లు-రెస్టారెంట్లు ఓనర్ల అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. కొత్త పన్ను సెస్ ఉపసహరించుకోవాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి బార్లు-రెస్టారెంట్లు మూతపడనున్నట్లు మూతపడనున్నాయి. ఈ మేరకు వారికి సంబంధించి అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విధించనున్న కొత్త పన్ను కారణంగా మా వ్యాపారాలు మరింత కుదేలవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రభుత్వం ప్రతి బార్‌పై వార్షికంగా 8 నుంచి 20 శాతం వరకు ప్రివిలేజ్ సెస్ విధించేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడున్న పన్నులు, లైనెన్సులకు ఏటా రూ. 33 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు భారీగా ఫీజులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని పేర్కొంది. దీనికితోడు ప్రతిపాదించిన సెస్ అమల్లోకి వస్తే.. ప్రతీ బార్‌పై అదనంగా ఏడాదికి మరో రూ.30 లక్షల వరకు ఆర్థికభారం పడుతుందని బార్లు-రెస్టారెంట్లు అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు.
దీనికితోడు వైన్ షాపుల వద్ద శాశ్వత పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం, విచ్చలవిడిగా అనధికారిక బెల్ట్ షాపులు పుట్టుకు రావడం వల్ల తమ వ్యాపారాలు నష్టాల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెస్ పేరిట అదనపు భారాన్ని మోపడాన్ని తప్పుబడుతున్నారు. . ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను కొనసాగిస్తామని తెగేసి చెప్పేశారు.
ALSO READ: ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1200కు పైగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ బంద్‌లో పాల్గొంటాయని తెలిపారు. నిరసనలో భాగంగా ఈనెల 5న ఎక్సైజ్ శాఖ ఆఫీసు వద్ద భారీ ధర్నా చేపట్టనుంది. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసనలు, భవిష్యత్తులో నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.