Zomato Distance Fee| ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో. ఇప్పుడు కొత్తగా కస్టమర్ల నుంచి అదనుపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో డెలివరీ అయ్యే ఆర్డర్‌ల కోసం కొత్త “లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు” విధించడం ప్రారంభించింది. ది ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. రూ. 150 కంటే ఎక్కువ విలువ గల ఆర్డర్ చేస్తే.. 4–6 కిలోమీటర్ల మధ్య డెలివరీకి రూ. 15 అదనంగా చెల్లించాలి. 6 కిలోమీటర్లకు మించిన ఆర్డర్‌లకు, నగరాన్ని బట్టి రూ. 25 నుంచి రూ. 35 వరకు అదనపు ఫీజు ఉంటుంది. ఈ ఫీజు కస్టమర్ ఎంత ఖర్చు చేసినా వర్తిస్తుంది.
జొమాటో తన రెస్టారెంట్ భాగస్వాములకు, కొత్త ఫీజులతో సహా మొత్తం సర్వీస్ ఫీజులు 30 శాతాన్ని మించవని తెలిపింది. అయితే, జొమాటో కమిషన్ రేట్లు 45 శాతం వరకు వసూలు చేస్తోందని రెస్టారెంట్లు ఆరోపిస్తున్నాయి. దీంతో చాలా రెస్టారెంట్ యజమానులు అసంతృప్తితో ఉన్నారు.
ఒక రెస్టారెంట్ యజమాని.. కమిషన్ నిబంధనలు తరచూ మారుతుండటంతో విసిగిపోయామని చెప్పారు. కొంతమంది రెస్టారెంట్ యజమానులు అయితే జొమాటోకు చార్జీలకు నిరసనగా ఒక రోజు ఆఫ్‌లైన్ విక్రయాలు జరపాలని ఆలోచనలో ఉన్నారు. ఈ నిరసన ద్వారా జొమాటో నిర్ణయాలను వ్యతిరేకించాలని వారి ఉద్దేశం.
జొమాటో కొన్ని రెస్టారెంట్లను కొత్త ఒప్పందాలపై సంతకం చేయమని కోరింది. ఎందుకంటే, జొమాటో మాతృ సంస్థ తన పేరును “ఎటర్నల్”గా మార్చుకుంటోంది. ఈ కొత్త ఫీజు విధానం ఒక పెద్ద ప్రణాళికలో భాగమని కంపెనీ చెబుతోంది. ఇటీవల, జొమాటో ఆహారం ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆధారంగా రేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఆహారం ఎక్కువ దూరం ప్రయాణిస్తే కస్టమర్ సంతృప్తి తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.
కరనా మహమ్మారికి ముందు..4–5 కిలోమీటర్ల లోపు ఉచిత డెలివరీ ఉండేది. అయితే, మహమ్మారి సమయంలో చాలా రెస్టారెంట్లు మూతపడడంతో ఈ దూరం 15 కిలోమీటర్లకు పెంచబడింది. ఇప్పుడు కొత్త ఫీజు విధానంతో ఈ సౌలభ్యం మళ్లీ మారుతోంది.
Also Read: కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా ఉద్యోగం మానేస్తే జరిమానా తప్పదు.. సుప్రీం కోర్టు తీర్పు
నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ఈ కొత్త ఫీజులపై జొమాటో విధానాల పట్ల ఆందోళనలు వ్యక్తం చేసింది. ఈ వారంలో ఈ సమస్యపై చర్చలు జరపాలనే యోచనలో రెస్టారెంట్ యజమానులు ఉన్నారు.
ఈ మార్పులు ఫుడ్ డెలివరీ వ్యాపారం వృద్ధి మందగిస్తున్న సమయంలో వస్తున్నాయి. జొమాటో ఇటీవల తన 10 నిమిషాల డెలివరీ సేవలైన క్విక్, ఎవ్రీడే సర్వీసెస్‌ను కూడా మూసివేసింది. ఈ నిర్ణయాలు కస్టమర్లు, రెస్టారెంట్ యజమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.
జొమాటో కొత్త ఫీజు విధానం కస్టమర్లకు అదనపు ఖర్చును తెచ్చిపెడుతుంది, అదే సమయంలో రెస్టారెంట్లపై.. కమిషన్ ఒత్తిడిని పెంచుతోంది. ఈ మార్పులు జొమాటో వ్యాపార వ్యూహంలో భాగమే అయినప్పటికీ, రెస్టారెంట్ యజమానుల నిరసనలు, కస్టమర్ల అసంతృప్తి ఈ సమస్యను మరింత సంక్లిష్టంగా చేస్తున్నాయి.