OTT Movie : వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు చూడాడనికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందుకే ఇలాంటి సినిమాలకు కూడా అభిమానులు బాగానే ఉంటారు. ఇక ఓటీటీలో ఇలాంటి సినిమాలకు కొదవేమీ లేదు. అలా ఓ సెన్సేషన్ కేసు ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? ఆ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
కథ ఒక గిరిజన గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ స్థానిక ఆదివాసీలు తమ భూమిని రాజకీయ, కార్పొరేట్ శక్తుల నుండి కాపాడుకోవడానికి పోరాడతారు. వర్గీస్ పీటర్ (టోవినో థామస్) ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. ముత్తంగా ఆదివాసీ ఆందోళనను అణచివేయడానికి పంపిన బెటాలియన్‌లో అతను కూడా ఒక భాగం. అయితే అతనికసలు అక్కడ జరుగుతున్నది న్యాయమేనా? జాబ్ పేరుతో చేస్తున్నది కరక్టేనా అనే సందిగ్ధతలో ఉంటాడు.
కథ నాన్-లీనియర్ ఫార్మాట్‌లో ఉంటుంది. ముందుగా వర్గీస్‌ను పోలీసు స్టేషన్ లో విచారిస్తారు. అతను ఒక సాధారణ కానిస్టేబుల్ అయినప్పటికీ, ఎందుకు అతన్ని అనుమానిస్తున్నారనేది కథ ద్వారా ఫ్లాష్‌బ్యాక్‌లలో వెల్లడవుతుంది. వర్గీస్ ముత్తంగా ఆందోళన సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివాసీలపై అణచివేత చర్యలను చూస్తాడు. ఇది అతని మనస్సాక్షిని కదిలిస్తుంది. ఆదివాసీ నాయకురాలు సీకే శాంతి (ఆర్య సలీం)… నిజ జీవితంలో సీకే జానును పోలిన పాత్ర, తమ భూమి హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిస్తుంది. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి ఎమోషనల్ గా ఉంటాయి.
అయితే వర్గీస్ తన జాబ్ చేయాలా ? లేక ఆదివాసీల పక్షాన నిలబడాలా అనే మానసిక సంఘర్షణలో చిక్కుకుంటాడు. మూవీలో అతని ప్రేమకథ కూడా ఒక భాగమే. అయితే ఒక ఆందోళనకారుడి మరణానికి వర్గీస్ ను బాధ్యుడిని చేస్తారు. దీంతో పోలీసులే అతన్ని అనుమానిస్తారు. అంతేకాదు ఇందులో మావోయిస్టుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. ఈ సంఘటనల కారణంగా వర్గీస్ తన ధైర్యాన్ని, నీతిని పరీక్షించే సిట్యుయేషన్ వచ్చి పడుతుంది. ఆర్. కేశవదాస్ (చెరన్), సురాజ్ వెంజరమూడ్ పాత్రలు కథలో కీలకమైనవి. కానీ అవి చెప్పేస్తే కథ స్పాయిల్ అవుతుంది. ఇంతకీ సినిమాలో వీరిద్దరి రోల్స్ ఏంటి? చివరికి కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
2025 లో రిలీజ్ అయిన మలయాళ పొలిటికల్ డ్రామా ‘నరివేట్ట’ (Narivetta) మూవీ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2003లో కేరళలో జరిగిన ముత్తంగా సంఘటన ఆధారంగా తెరకెక్కింది. నరివేట్ట అంటే తెలుగులో “జాకల్ హంట్”. కేరళలోని వయనాడ్‌లో 2003లో జరిగిన ముత్తంగా ఆదివాసీ ఉద్యమం నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. అప్పట్లో ఆదివాసీ సమాజం ఎదుర్కొన్న అణచివేత, పోలీసు హింస, భూమి హక్కుల కోసం పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందులో టోవినో థామస్, సురాజ్ వెంజరమూడ్, చెరన్ , ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, రిని ఉదయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 మే 23న థియేటర్లలో విడుదలైంది. జూలై మొదటి వారంలో ZEE5 ఓటీటీలోకి ఈ మూవీ రాబోతోంది.
Read Also : మృత్యు దేవతతో అమ్మాయి పోరాటం… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని మలుపులు