Zomoto new name : ప్రముఖ ఆహార డెలివరీ సంస్థ జొమాటో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అయితే.. ఈ సంస్థ తన కంపెనీ పేరును మార్చుకుంటోంది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 6న స్టాక్ ఏక్స్ఛేంజ్ కు సమర్పించిన ఫైలింగ్ లో సంస్థ వెల్లడించింది. సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. తాము మరింత బాధ్యతల్లోకి వెలుతున్నట్లు ప్రకటించారు. ఇకపై.. జొమాటో తన పేరును ఎటర్నల్ అనే కొత్త పేరుతో కనిపించనుంది.
సోషల్ మీడియాలో ఎటర్నల్ పేరును ప్రకటిస్తూ.. షేర్ హోల్డర్లు, జొమాటో వినియోగదారులకు ఓ లేఖ రాసిన దీపిందర్ గోయల్.. అందులో అనేక విషయాల్ని పంచుకున్నారు. ఇప్పుడు సంస్థ పేరుగా అనుకున్న ఎటర్నల్ పేరును ఎప్పుడో గతంలోనే అనుకున్నామని, కానీ అప్పుడు పెట్టలేకపోయినట్లు తెలిపారు. తొలుత.. బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు, కంపెనీ బ్రాండ్, యాప్ మధ్య తేడాను గుర్తించేందుకు అంతర్గతంగా “ఎటర్నల్” (జొమాటోకు బదులుగా) ఉపయోగించడం ప్రారంభించినట్లు తెలిపారు. కానీ.. అదే పేరును కంపెనీ పేరుగా పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
ఎటర్నల్ అనేది జొమాటోకు సంబంధించిన అన్ని వ్యాపారాలకు కేంద్రంగా పని చేస్తుంటుంది. దీని కింద నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయని సంస్థ వెల్లడించింది. వాటిలో.. జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ కార్యకలాపాలు.. ఈ ఎటర్నల్ సంస్థ కింద ఉండనున్నాయి. సంస్థకు ఈ పేరు పెట్టేందుకు తనకు చాలా భయంగా ఉందన్న దీపింద్ర గోయల్.. ఎటర్నల్ అనేది ఒక శక్తివంతమైన పేరుని అన్నారు. ఎందుకంటే ఆ పేరు ఒక గొప్ప బాధ్యతను సూచిస్తుందని, మన మరణమే మన అమరత్వానికి కారణమని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, మనం నిజంగా చిరస్థాయిగా నిలుస్తామని సూచిస్తుందని అన్నారు. మనం ఎప్పటికీ కొనసాగుతామన్న అహంకారం పుట్టినప్పుడు, మన పతనం ప్రారంభమవుతుందన్న జోమాటో సీఈవో.. ఎటర్నల్‌లో పని చేయడం అంటే ప్రతి రోజూ మరింత మెరుగ్గా మారాలని, మన పరిమితులను అంగీకరించాలని, నిత్యం ఎదగాలని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇది కేవలం పేరు మార్పు కాదంటూ ప్రకటించిన జొమాటో సీఈఓ దీపింద్ర గోయల్.. ఇది ఒక లక్ష్య ప్రకటన, ముందుకు సాగాలనే సంకల్పానికి సంకేతం అంటూ సంస్థ ఉద్యోగులకు హితబోధ చేశారు. ప్రత్యర్థి స్విగ్గీ మాదిరిగానే కంపెనీ ప్రధాన వ్యాపారం, ఫుడ్ డెలివరీ మందగమనానికి లోనవుతున్న తరుణంలో సంస్థ పేరు మార్పు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం నవంబర్ రెండవ భాగంలో ప్రారంభమైన డిమాండ్‌లో విస్తృత స్థాయిలో మందగమనం నెలకొందని జొమాటో ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ విభాగం CEO రాకేష్ రంజన్ జనవరి 20న సంస్థ ఫలితాలను ప్రకటిస్తూ కంపెనీ వాటాదారుల లేఖలో తెలిపారు.
Also Read : ట్రంప్ భారీ పన్నుల మోత – భారత్ ఎలక్ట్రానిక్స్‌కు కలిసొచ్చిన కాలం.. ఎలాగంటే..
Q3 FY25 సమయంలో.. జొమాటో తన ఏకీకృత పన్ను తర్వాత లాభం (PAT) ఏడాదికి (YoY) 57 శాతం తగ్గి రూ.59 కోట్లకు పడిపోయిందని వెల్లడించింది. ఇది గతేడాది ఇదే కాలంలో రూ.138 కోట్ల నుంచి.. ఈ స్థాయికి పడిపోయినట్లు వెల్లడించింది. ఇది Q2 FY25లో రూ.176 కోట్ల PATని సాధించినట్లు వెల్లడించింది. అయితే సంస్థ ఆదాయాలు Q3 FY25లో 64 శాతం పెరిగి రూ.5,404 కోట్లకు చేరుకున్నాయి, ఇది ఒక సంవత్సరం క్రితం రూ.3,288 కోట్లు కాగా.. గత త్రైమాసికంలో రూ.4,799 కోట్లుగా ఉంది.