Zomato IRCTC | రైలు ప్రయాణంలో మంచి భోజనం కోసం ప్రయాణికులు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ట్రైన్ లో రైల్వే ప్యాంట్రీ ఉన్నా ఏ మాత్రం రుచి, నాణ్యత లేని భోజనం చూసి ప్రయాణికులు అది తినడానికి ఇష్టపడరు. ఇక రైలు ప్రయాణికులు ఈ సమస్య ఉండదు. త్వరలోనే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రైలు యాత్రికులకు వారికి ఇష్టమైన ఆహారం డెలివరీ చేయనుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తో జొమాటో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 88 నగరాల్లో ఈ సర్వీస్ ప్రారంభించారు. 100 రైల్వే స్టేషన్లలో 10 లక్షల ఆర్డర్లు కూడా పూర్తి చేసినట్లు జొమాటో అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై జొమాటో సిఈఓ రాకేష్ రంజన్ మాట్లాడుతూ..” రైల్వే శాఖతో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ట్రైన్ ప్యాసింజర్లకు వారికిష్టమైన ఆహారం ప్రయాణ సమయంలో అందిస్తే.. ఆ అనుభూతి వారికి గుర్తుండి పోతుంది. ఐఆర్‌సిటిసితో కలిసి మేము ప్రారంభించిన ఈ అధ్యాయంలో దేశంలోని కోట్ల మంది సౌకర్యవంతంగా, ఆనందంగా రైలు ప్రయాణం చేయగలరని నమ్ముతున్నాను” అని చెప్పారు.
‘జొమాటో- ఫుడ్ డెలివరీ ఇన్ ట్రైన్స్’ అనే ఆప్షన్ ద్వారా కస్టమర్లు ట్రైన్ లో ప్రయాణం ఉన్నా.. లేదా రైల్వే స్టేషన్ లో నుంచి అయినా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ట్రైన్ లో నుంచి ఆర్డర్ బుక్ చేయడానికి.. జొమాటో యాప్ ఓపెన్ చేసి ‘Train’ అనే కీవర్డ్ సెర్చ్ చేయండి. లేదా స్టేషన్ లో ఉన్నప్పుడు యాప్ లో లొకేషన్ అప్డేట్ చేయండి. ఆ తరువాత మీ టికెట్ పిఎన్ఆర్ నెంబర్ అందులో ఎంటర్ చేయండి. దీని ద్వారా జొమాటో మీ సీటు, ట్రైన్ నెంబర్ వివరాలు తెలుసుకొని మీరు ఆర్డర్ చేసిన భోజనం మీ సీటు వరకు డెలివరీ చేస్తుంది.
ట్రైన్ స్టేషన్ కు వచ్చే కొంత సమయం ముందే మీ ఆర్డర్ తీసుకొని జొమాటో డెలివరీ బాయ్ స్టేషన్ వద్ద ఎదురుచూస్తూ ఉంటాడు. అలా ప్రయాణికులు తమ ఆర్డర్ ని స్టేషన్ వద్ద ఉన్న జొమాటో పికింగ్ పాయింట్స్ నుంచి తీసుకోవచ్చు. ఈ వసతి ప్రస్తుతానికి కొన్ని స్టేషన్‌ల లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒక వేళ్ల ట్రైన్ ఆలస్యంగా నడుస్తుంటే జొమాటో ట్రైన్ రన్నింగ్ స్టేటస్ ని ట్రాక్ చేస్తూ సరైన సమయానికి డెలివరీ చేస్తుంది.
రైలు ప్యాసింజర్లకు భోజనం డెలివరీని 2023లోనే జొమాటో ప్రారంభించింది. ముందుగా ఢిల్లీ, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లఖ్ నవ్, వారణాసి లాంటి 5 రైల్వే స్టేషన్లలో ఈ సర్వీస్ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభమైంది. ఆ తరువాత అహ్మదాబాద్, నాగ్ పూర్, గోవా, భోపాల్, సూరత్ లాంటి ఇతర నగరాలకు ఈ ట్రైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ని ఎక్స్‌టెండ్ చేశారు.
జొమాటోనే కాదు, ఫుడ్ డెలివరీ చేస్తున్న మరో దిగ్గజ సంస్థ స్వీగ్గీ కూడా మార్చి 2024 నుంచి ఐఆర్‌సిటిసి తో చేతులు కలిసి బెంగుళూరు. విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ లాంటి నాలుగు ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ సర్వీస్ ని మొదలెట్టింది. ఈ సంవత్సరం చివరి లోగా 59 రైల్వే స్టేషన్లలో స్వీగ్గీ ఫుడ్ డెలివరీ చేసేందుకు సిద్ధమవుతోంది.
Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..