Tuni Accident: కాకినాడ జిల్లా తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిగ్రీ కాలేజ్ వద్ద ఆగి ఉన్న లారీని అతివేగంతో ఢీ కొట్టిందో కారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అవ్వగా.. ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని కాకినాడ GGHకు తరలించారు. సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు విజయవాడ కృష్ణానది కరకట్టపై కారు ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలోనే ఓ బెంజ్ కారు..కరకట్టపై నుంచి కిందకు దూసుకెళ్లింది. అయితే కారులో ప్రమాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కారును బయటకు తీశారు. కరకట్ట వెంబడి బంకమట్టి ఉండటం వల్ల వర్షానికి కారు స్కిడ్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మీర్‌పేట్‌లో విషాద సంఘటన జరిగింది. పార్క్‌లో ఆడుకుంటున్న చిన్నారిపై.. పక్కనే ఉన్న ఓపెన్ జిమ్ లోని ఇనుపరాడ్డు పడింది. ఈ ఘటనలో బాలుడు మృతిచెందాడు.
మీర్‌పేట్ పరిధిలోని జిల్లెల్లకూడా దాసరి నారాయణరావు కాలనీలో ఉంటున్న ప్రసాద్-వాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు రోజులాగే ఇంటి పక్కనున్న మంత్రాల చెరువుకట్టపై ఆడుకుంటున్నాడు. పక్కనే ఓపెన్ జిమ్ ఉంది. అందులో ఉన్న ఇనుపరాడు ప్రమాదవశాత్తు చిన్నారిపై పడింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు.
Also Read: ముగ్గురు లవర్స్‌తో కలిసి.. భర్తను ఆరు ముక్కలు చేసి.. భార్య అరాచకం
లక్షలాది రూపాయలతో కార్పొరేషన్లలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు కానీ… వాటికి సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పార్కులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.