UP News: ప్రేమ గుడ్డిదనే డైలాగ్స్ అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అది నిజమో కాదో తెలీదు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 52 ఏళ్ల మహిళకు ఏడాదిన్నర కిందట ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దాన్ని పెళ్లిగా మార్చుకోవాలని భావించింది. చివరకు ఆమెని చంపేశాడు లవర్. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.
యూపీలోని మెయిన్‌పురికి చెందిన 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్-ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల రాణికి ఏడాదిన్నర కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లయిన రాణికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇన్‌స్టాలో ఫిల్టర్లు ఉపయోగించి తాను చిన్న యువతిగా పరిచయం చేసుకుంది. ఆ ఫొటోలు చూసిన అరుణ్, ఆమెతో ప్రేమలో పడ్డాడు.
ఆ తర్వాత అరుణ్-రాణి ప్రత్యక్షంగా ఫరూఖాబాద్‌లోని పలు హోటళ్లలో సమావేశమయ్యేవారు. తొలిసారి రాణిని నేరుగా చూడగానే షాకయ్యాడు అరుణ్. రాణి వయస్సు చాలా ఎక్కువగా ఉందని భావించాడు. ఈ విషయం ఆమెతో చెప్పకుండా మనసులో దాచుకున్నాడు. ఈ క్రమంలో రాణి దగ్గర నుంచి డబ్బులు గుంజడం మొదలు పెట్టాడు.
ఏకంగా రూ.1.5 లక్షలు వరకు తీసుకున్నాడు. ఇద్దరు మనసులు ఒకటి కావడంత తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై రాణి ఒత్తిడి చేసేది. ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేసింది. ఈ సమస్యకు ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు అరుణ్. అందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆగస్టు 10న మెయిన్‌పురికి రావాలని రాణిని పిలిచాడు.
ALSO READ: లారీ వల్ల ఘోర యాక్సిడెంట్.. స్పాట్‌లో డ్యాన్సర్ మృతి
పెళ్లి-డబ్బు విషయమై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆవేశానికి లోనైన అరుణ్.. రాణి గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె మొబైల్ నుండి సిమ్ కార్డు తీసేశాడు. మరుసటి రోజు అంటే ఆగష్టు 11 కర్పారి గ్రామంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. ఆమె మెడపై గొంతు కోసి చంపిన గుర్తులు కనిపించడంతో హత్య చేసినట్లు భావించారు.
ఆమె వివరాలు తెలియలేదు. మృతదేహం దగ్గర ఓ మొబైల్ ఫోన్ కనిపించింది. పోలీసులు ఆ మహిళ ఫోటోను ఆ జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు పంపారు. అదే సమయంలో మహిళ కనిపించలేదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాణి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియా ద్వారా వివరాలు బయటకు తీశారు.
చివరకు నిందితుడు అరుణ్‌ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించాడు.పెళ్లి చేసుకోకుంటే పోలీసులకు నిజం చెబుతానని రాణి బెదిరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు అంగీకరించాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఫోటోలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని జైలుకు తరలించారు.