Anantapuram: కుటుంబ భారం మోయలేక ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అదేంటి ఏ మాత్రం కుటుంబ భారమో అనుకుంటున్నారా.. ఏకంగా ఇతనికి ఇద్దరు భార్యలు, ఏడుగురు సంతానం. వారిని పోషించలేక ఉన్న వృత్తిని వదిలి, దొంగగా మారాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యాడు.
అనంతపురంకు చెందిన ఖాజాపీరా పెయింటర్ వృత్తిలో జీవనం సాగించేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు కాగా, వారికి ఏడు మంది సంతానం. రోజురోజుకు కుటుంబపోషణ భారంగా మారింది అతనికి. చాలీచాలని డబ్బులతో తన ఏడుమంది పిల్లలను పోషించలేక ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయాడు. అంతలోనే ఖాజాపీరాకు మహేష్, జమీర్ లతో స్నేహం ఏర్పడింది. ముగ్గురు ఏకమై దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నారు. అలా కేవలం ఒక్క ఏపీలోనే చోరీలు చేశారనుకుంటే పొరపాటే.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో సైతం చోరీలకు పాల్పడ్డారు. ఉదయం పెయింటర్ పని చేయడం, రాత్రి చోరీలకు పాల్పడడం ఖాజాబీర అలవాటుగా మార్చుకున్నాడు. ఒక ఖాజా పీరా పైనే 41 కేసులు ఉన్నాయంటే, వీరు చోరీలకు పాల్పడి తీరును అంచనా వేయవచ్చు. ఈ అంతరాష్ట్ర ముఠాపై ఏపీలో 14, తెలంగాణలో 4, కర్ణాటకలో 9 కేసులు నమోదయ్యాయి. తాజాగా 300 గ్రాముల బంగారం దొంగతనం జరగడంతో ఈ ముఠా చోరీలు ఒక్కసారిగా ధర్మవరంలో వెలుగులోకి వచ్చాయి.
Also Read: Pushpa 2 In AP: పుష్ప-2 హిట్.. అంబటి ప్లాప్.. అరెరె టార్గెట్ మిస్ అయిందే!
చిట్ట చివరకు పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. పలుమార్లు జైలుకు వెళ్లిన వీరు, బయటకు రావడం మళ్ళీ చోరీలకు పాల్పడడం ఇదే అలవాటుగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద రూ. 22 లక్షల విలువగల 310 తులాల బంగారం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ధర్మవరం పోలీసులు తెలిపారు. తాళం వేసిన గృహాలే టార్గెట్ గా ఎంచుకుని చోరీలకు పాల్పడే వారని, ఒకక్కరిపై పాతికకు పైగా కేసులు ఉన్నాయన్నారు. మొత్తం మీద చిన్న కుటుంబం చింతలేని కుటుంబమన్న విషయాన్ని మరచిన ఖాజాపీరా, ఏకంగా ఇద్దరు భార్యలను, ఏడుగురు పిల్లలను పోషించేందుకు దొంగగా మారి చివరగా జైలు పాలయ్యాడు.