Bheemili Honey Trap Case: హలో.. తిన్నారా.. ఎలా ఉన్నారు.. అంటూ ఓ యువతి ఫోన్. అవతలి వ్యక్తి మీరెవరండి నేను గుర్తు పట్టడం లేదంటూ మాట. మీరు నాకు తెలుసండి.. ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం అంటూ ఆ యువతి మాట. ఎవరు ఈమె? ఎవరైనా కానీ పూర్తి వివరాలు తెలుసుకుందామని అనుకున్నాడు ఆ వ్యక్తి. ఇంకేముంది మాట మాట కలిపాడు. చివరికి హనీ ట్రాప్ లో పడి మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు.
వైజాగ్ హనీట్రాప్ కేసును మరచిపోకముందే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలను వలవేయడం, బెదిరింపులకు పాల్పడడం హనీట్రాప్ కేసు అసలు సంగతి. వైజాగ్ హనీట్రాప్ కేసులో ఎందరో బాధితులు నేటికీ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. వైజాగ్ పోలీసులు మాత్రం హనీట్రాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువతి జాయ్ జమీమాతో పాటు పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సేమ్ టు సేమ్ ఇదే తరహాలో జరిగిన ఓ ఘటన భీమిలిలో వెలుగులోకి వచ్చింది.
శ్రీకాకుళం వాసి రామారావుకు ఈనెల 18న యువతి నుండి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈనెల 19న రామారావు పెద్దిపాలెం వెళ్తుండగా మరోసారి ఫోన్ కాల్ వచ్చింది. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని యువతి కవ్వింపు మాటలతో చెప్పింది. ఇక అంతే రామారావు అక్కడికి వెళ్లగానే, నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. యువతి రమ్మంటే వచ్చాను కానీ, ఇదేంది దాడి జరుగుతోందని రామారావు భయపడ్డాడు. గట్టిగా కేకలు వేస్తున్న క్రమంలోనే, దాకమర్రిలో నిర్మానుష్య ప్రాంతానికి రామారావును దుండగులు తీసుకెళ్లారు.
Also Read: Guntur News: ఆ ఆలయం హుండీ లెక్కింపుకు సర్వం సిద్దం.. ఆ నోట్లు చూసి అంతా షాక్..
అక్కడ రామారావుపై మరోమారు దాడికి పాల్పడి అతని వద్ద గల 48 వేల నగదు, ఏటీఎం కార్డులను వారు లాక్కున్నారు. అంతటితో రామారావును వదిలివేసి వారు అక్కడినుండి పారిపోయారు. ఏటిఎం పిన్ నెంబర్లు తెలుసుకున్న దుండగులు నేడు రామారావు ఖాతా నుంచి మరో 7 వేలు కాజేశారు. దీనితో నగదు మాయంపై భీమిలి పీఎస్ లో బాధితుడి ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన విషయాన్ని తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దర్యాప్తు ముమ్మరం చేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసుతో సంబంధం గల మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు రామారావుకు ఫోన్ చేసింది ఎవరు? ఆ యువతి ఇలా ఎంతమందిని మోసం చేసింది? దుండగులకు యువతికి గల సంబంధం ఏమిటనే విషయాలకు పోలీసుల దర్యాప్తులోనే వెల్లడి కావాల్సి ఉంది.