South Africa vs Australia : వరల్డ్ కప్ క్రికెట్ లో అత్యంత దురదృష్టవంతమైన జట్టు ఏదైనా ఉందంటే అది సౌతాఫ్రికా అనే చెప్పాలి. ప్రతిసారి లీగ్ మ్యాచ్ ల్లో దుమ్ము రేపడం, నాకౌట్ మ్యాచ్ ల్లో ఒత్తిడితో ఓటమిపాలు కావడం షరా మామూలే అయ్యింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో చేజేతులారా క్యాచ్ లు కాదు మ్యాచ్ నే వదిలేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు క్యాచ్ లు డ్రాప్ చేశారు. అప్పనంగా తీసుకెళ్లి ఆస్ట్రేలియా చేతిలో పెట్టారు.
ఇప్పటివరకు సౌతాఫ్రికా ఐదుసార్లు (1992, 1999, 2007, 2015, 2023 ) సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. లీగ్ మ్యాచ్ ల్లో దుళ్లగొట్టడం, సరిగ్గా నాకౌట్ మ్యాచ్ ల్లో చేతులెత్తేయడం జట్టుకి ఒక హాబీగా మారిపోయింది. ఆరంభశూరులు అనే పేరు సౌతాఫ్రికాకు కరెక్టుగా సరిపోతుంది.
అయితే శ్రీలంకతో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్ లోనే ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. అలా వన్డే వరల్డ్ కప్ 2023లో ప్రపంచ రికార్డ్ తో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. ఒక్కసారి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంత అద్భుతంగా ఆడుతుందంటే ఈసారి కచ్చితంగా కప్ పట్టుకెళుతుందనే అనుకున్నారు.
2023 వన్డే వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో కేవలం రెండింట్లో ఓడి, ఏడింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికల్లో రెండో స్థానంలో నిలిచింది. లీగ్ మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా ఇతర జట్లపై చేసిన స్కోర్లు ఇవి..
శ్రీలంకపై (428), ఇంగ్లండ్ (399), బంగ్లాదేశ్ (382), న్యూజిలాండ్ (357), పాకిస్తాన్ (271), ఆఫ్గనిస్తాన్ (247), ఆస్ట్రేలియా (212), నెదర్లాండ్స్ (207), ఇండియా (83) చేసింది. ఇంత గొప్పగా ఆడి చివరికి సెమీఫైనల్ గల్లీ క్రికెట్ ఆడినట్టు ఆడి గెలవాల్సిన మ్యాచ్ ని చేజేతులారా వదిలేసింది. ఒకటా, రెండా ఆరు క్యాచ్ లు వదిలేసి తగిన మూల్యం చెల్లించుకుంది.