Brutal Murder: తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తిని ముగ్గురు అతికిరాతకంగా హత్య చేశారని కొవ్వూరు పోలీసులు తెలిపారు. కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద పొలంలో గత నెలలో జరిగిన హత్య కేసును చేదించినట్లు కొవ్వూరు DSP దేవకుమార్ వెల్లడించారు. మార్చి 26వ తేదీన రాత్రి కొమ్మేరు వద్ద పెండ్యాల ప్రభాకర్ రావును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆ తర్వాత కుడి చెయ్యి మణికట్టు వరకు నరికి ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పెండ్యాల ప్రభాకర్ రావు దగ్గర చుక్కా రామ శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.24 వేలు అప్పు తీసుకున్నాడు. ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమన్నందుకే మరో ఇద్దరితో కలిసి శ్రీనివాస్ హత్యకు ప్లాన్ చేశాడని పోలీసులు వెల్లడించారు.
ALSO READ: ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య
మాట్లాడదాం రమ్మని ప్రభాకర్‌ను దొమ్మేరు దగ్గర ఉన్న పొలం దగ్గరకి రప్పించారట. ఆ తర్వాత కత్తితో నరికి చంపేశారు. అనంతరం ప్రభాకర్ రావు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని పారిపోయారు. అయితే ఉంగరాలు, కడియం రాకపోవడంతో చేతిని నరికేశారట. పోలీసుల విచారణలో శ్రీనివాస్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుండి 36 గ్రాముల బంగారం, 4 సెల్ ఫోన్లు రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్‌పై జైల్లో ఉంచారు.