హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్‌లో జరిగిన తల్లీకూతుళ్ల మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా చిత్రీకరించేందుకు భర్త అజారుద్దీన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. పక్కా ప్లాన్‌తో భార్యను, ఇద్దరు కుమార్తెలను అతను అంతమొందించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారనే కక్షతోనే ఈ కిరాతకానికి పాల్పడినట్లు సమాచారం.
ప్లాన్ ప్రకారం హత్య
నిన్న రాత్రి 8 గంటల సమయంలో భార్య ఫర్హానా, కుమార్తెలు ఉమెరా, ఆయేషాలను అజారుద్దీన్ స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేనిది చూసి ముగ్గురిని నీటిలో ముంచి చంపేశాడు. అనంతరం మృతదేహాలను పూల్‌లోనే వదిలేసి బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చిన అజార్.. తన కుటుంబ సభ్యులు నీటిలో పడిపోయారంటూ కేకలు వేస్తూ నాటకమాడాడు. మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించి.. అక్కడ అందరి ముందు ఏడుస్తూ తానూ బాధితుడినేనని నమ్మించే ప్రయత్నం చేశాడు.
ముందే సీసీ కెమెరాలు ఆఫ్
ఈ హత్యకు అజార్ ముందు రోజే స్కెచ్ వేశాడు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న ఐదు సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆపివేశాడు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు డీవీఆర్ (DVR) కూడా తొలగించాడు. తన కుమార్తె పుట్టినరోజు కావడంతో వేడుకల కని అక్కడికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన నేరం ఎవరికీ తెలియదని భావించిన అజార్.. పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయాడు.
ఆడపిల్లలపై ద్వేషం
అజారుద్దీన్‌కు ఆడపిల్లలంటే మొదటి నుంచీ అయిష్టం. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండగా.. మూడోసారి కూడా భార్య గర్భం దాల్చింది. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని ఫర్హానాను వేధించాడు. గతంలో కూడా రెండుసార్లు ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారి ఫర్హానా అబార్షన్ కు నిరాకరించడంతో ఆమెపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. తన మాట వినలేదన్న కక్షతో గర్భంతో ఉన్న భార్యను, పసిపిల్లలను బలి తీసుకున్నాడు.
పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలిన సత్యం
సంఘటనా స్థలంలో అజార్ ప్రవర్తనపై పోలీసులకు మొదట్లోనే అనుమానం వచ్చింది. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సీసీ కెమెరాలు పని చేయకపోవడం, డీవీఆర్ మాయమవడం అజార్ వైపే వేలెత్తి చూపాయి. గర్భవతి అయిన భార్యను, అభం శుభం తెలియని చిన్నారులను కిరాతకంగా చంపిన అజార్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ALSO READ: మతసామరస్యానికి ప్రతీక.. హనుమాన్ దీక్షలో ముస్లిం యువకుడు, ఫోటో వైరల్