Dehradun Car Accident : కొత్తగా కారు కొన్నాడని సంతోషంగా పార్టీ చేసుకున్న యువతీ, యువకులు.. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఖరీదైన కారులో రోడ్డుపై జాలీగా వెళ్లిన వారంతా.. వెనుక నుంచి ఓ కంటైనర్ ను ఢీ కొట్టి మరణించారు. సంఘటనా స్థలంలో ఆరుగురు విగత జీవులుగా పడిపోగా.. అందులో ఇద్దరు తలలు తెగిపోవడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. ఇంతటి ఘోర ప్రమాదం.. డెహ్రాడూన్ లోని (Dehradun car accident) ఓఎన్‌జీసీ చౌక్‌లో చోటుచేసుకుంది.
ప్రమాదానికి గురైన ఇన్నోవా సహరాన్‌పూర్‌కు చెందిన వ్యాపారి సునీల్ అగర్వాల్‌కు చెందిందిగా పోలీసులు గుర్తించారు. ఇటీవలే కారు కొనుగోలు చేయగా.. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. కారు కొన్న సందర్భంగా పార్టీ ఇవ్వమని స్నేహితులు కోరుతుండడంతో.. ఆ కారులోనే అతని కుమారుడు అతుల్, అతని ఆరుగులు స్నేహితులు డెహ్రాడూన్‌కు వెళ్లారు.అక్కడ సిద్ధేష్ అగర్వాల్ అనే స్నేహితుడి ఇంట్లో రాత్రి పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచి డ్రైవ్ కు వెళ్లారు, అదే వారికి చివరి పార్టీగా మారిపోయింది.
రోడ్డుపై అత్యంత వేగంగా వెళిన్న వీరంతా.. అప్పటి వరకు సరదాగా ఆనందిస్తున్నారు. వీరిలో కొందరు కారు రూఫ్ టాప్ లో నిలబడి ఉన్నారు. అప్పుడే.. కారు కంటైనర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. దాంతో.. స్పాట్ లోనే ఆరుగురు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వీరిలో కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24), రిషబ్ జైన్ (24), నవ్య గోయెల్ (23), కామాక్షి (20), గునీత్ (19) అనే విద్యార్థులు మరణించారు. కాగా.. అత్యంత ఘోరంగా.. రూఫ్ టాప్ లో నిలుచున్న ఇద్దరు వ్యక్తుల తలలు తెగిపోయాయి. ప్రమాద తీవ్రతకు కారంతా నుజ్జునుజ్జుగా మారిపోయింది.
ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని భావిస్తున్న పోలీసులు.. ప్రాథమిక విచారణలో ట్రక్ డ్రైవర్ తప్పు చేయలేదని గుర్తించినట్లు తెలిపారు. ట్రక్కు ఎడమ వెనుక వైపు బ్లైండ్ స్పాట్‌ను ఢీకొట్టినట్లు వెల్లడించారు. కారు ప్రయాణించిన మార్గంలోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి ముందు కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా నడిపిపారని, వేగంగా కూడా మధ్యస్థంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే.. ఓఎన్ జీసీ (ONGC) కూడలి దగ్గరకు వచ్చే వరకు వేగాన్ని పెంచినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ లగ్జరీ కారును అధిగమించేందుకు చేసిన ప్రయత్నమే.. ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో జరిగినట్లు గుర్తించారు.
కారు ప్రమాదం గురించి తెలిసి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Chief miniser Pushkar Singh Dhami) స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అయితే.. విద్యార్థుల బృందం మద్యం సేవించి, పార్టీలు చేసుకుంటున్నట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో యువతీ, యువకులు డ్యాన్సులు చేస్తూ, ఆల్కహాలు తీసుకుంటున్నట్లు ఉంది. దానితో పాటు రోడ్డుపై అతివేగంతో వాహనాలు నడుపుతున్నట్లుగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీ సైతం బయటకు వచ్చింది. అయితే, శవపరీక్ష ఫలితాలు పెండింగ్‌లో ఉన్న కారణంగా.. పోలీసులు దీనిని ఇంకా ధృవీకరించలేదు.
ALso Read :మైనర్‌తో పెళ్లి నాటకం.. ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష.. ఏమైందంటే
ప్రమాదంలో చనిపోయిన విద్యార్థు సిద్ధేష్ తండ్రి, విపిన్ అగర్వాల్ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతికి కారణాలపై ఊహాగానాలు మానుకోవాలని, ప్రస్తుత కష్ట సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరారు.