Bus Accident: రాజస్థాన్ పరిధిలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లా ధనవాడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ స్లీపర్ బస్సు.. అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో రణరంగంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో భారీగా మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది.
నిద్రమత్తులో ఐదుగురు సజీవదహనం
ఈ ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో ఊహించే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. వీరిలో ఐదుగురు ప్రయాణికులు మంటల తీవ్రతకు బస్సులోనే సజీవదహనం కావడం అత్యంత కలచివేసే అంశం. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
29 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
ఈ ప్రమాదంలో మరో 29 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ బస్సు ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రిషికేష్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు తిరుగు ప్రయాణమైన క్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
ఈ రోడ్డు ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరగడంతో, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక వేగ నియంత్రణ కోల్పోవడం వంటి ఇతర సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలపై మితిమీరిన వేగం, డ్రైవర్ల అలసట ఇలాంటి ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయని, ప్రయాణికులు రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి..! విచారణలో నిందితుడి సంచలన నిజాలు!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
రాజస్థాన్ దౌసా జిల్లా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. రిషికేశ్ నుంచి ఇందౌర్ వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి పైగా గాయపడగా, వారిని చికిత్సకై ఆసుపత్రికి తరలించారు.… pic.twitter.com/oBVJzQtNiy
— BIG TV Breaking News (@bigtvtelugu) July 1, 2026