Fake Websites: నకిలీ వెబ్ సైట్లు తయారు చేసి భక్తులను, పర్యాటకులను టార్గెట్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ ముఠా చేసిన దందా తెలుసుకుంటే ఔరా అనేస్తారు. అంతేకాదు వీరికి నకిలీ వెబ్ సైట్లు సృష్టించడం, మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. అయితే పోలీసులకు చిక్కకుండా, పక్కా ప్లాన్ తో భక్తులను మోసం చేస్తున్న ఈ ముఠా అంతు తేల్చారు ఏపీలోని బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ.
అంతా సేమ్ టు సేమ్ వెబ్ సైట్స్..
సాధారణంగా ఏదైనా పర్యాటక ప్రాంతానికి, ఆలయ సందర్శనకు వెళ్లే సమయంలో వెబ్ సైట్స్ ను సందర్శించడం కామన్. ఈ అంశాన్ని పావుగా మార్చుకున్న రాజస్థాన్ కు చెందిన పరంజీత్, బిట్టూలు సేమ్ టు సేమ్ నకిలీ వెబ్ సైట్స్ ను సృష్టించారు. వీరు వెబ్ సైట్స్ సృష్టించిన జాబితాలో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ ను పోలిన మరో వెబ్ సైట్ ను తయారు చేసి మోసం చేయడం మరో విశేషం. భక్తులకు, పర్యాటకులకు ఏ అనుమానం రాకుండా అదే స్థాయి వెబ్ సైట్స్ ను క్రియేట్ చేసి అందినకాడికి దోచుకుంటున్న అతి పెద్ద ముఠా ఇదేనని పోలీసులు అంటున్నారు.
నేరం వెలుగులోకి ఎలా?
రాజస్థాన్ కు చెందిన పరంజీత్, బిట్టూలు రోజూ అనధికార వెబ్ సైట్స్ ద్వారా లక్షలు ఆదాయం పొందుతూ మోసాల పర్వం సాగిస్తూ వచ్చారు. అయితే చివరకు బాపట్ల సూర్యలంక హరిత రిసార్ట్స్ పేరుతో Harith Beach Resort Suryalanka అనే నకిలీ వెబ్‌సైట్ ద్వారా పర్యాటకులను మోసం చేసే పనికి పూనుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన హరిత రిసార్ట్స్ మేనేజర్, జూన్ 16, 2024న బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిందితుల చిట్టా పెద్దదే!
బాపట్లలో నమోదైన కేసు ఆధారంగా ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. అయితే వీరి నేరాల చిట్టా చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు. హరిత రిసార్ట్స్ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు – 49, తిరుమల, శ్రీశైలం, త్రయంబకేశ్వర్ దేవస్థానాల నకిలీ వెబ్‌సైట్లు – 11, మేరు మహాదేవ్ రిసార్ట్ పేరుతో – 2, ఇతర హోటల్ గదుల బుకింగ్‌ల మోసాలు – 12, OLX స్కామ్‌లు, ఫేక్ ఐడెంటిటీలు, UPI మోసాలు తదితర ఇతర ఆన్‌లైన్ మోసాలు – 52 ఫిర్యాదులు వీరిపై నమోదయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మొత్తం 127 ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.
రాష్ట్రాల వారీగా ఫిర్యాదుల లెక్క ఇదే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – 59, మహారాష్ట్ర – 14, ఉత్తరప్రదేశ్ – 12, రాజస్థాన్ – 9, కర్ణాటక – 8, ఢిల్లీ – 5, పంజాబ్ – 4, గుజరాత్, ఒడిషా రాష్ట్రాలలో 3, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలలో 2, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లలో ఒక్కొకటి చొప్పున ఫిర్యాదులు వీరిపై నమోదయ్యాయి.
సైబర్ మోసగాళ్ళు ఎలా చిక్కారంటే?
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల గాలింపు మొదలు పెట్టరు. ఒక బృందంలో బాపట్ల రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఉన్నారు. మరొక బృందానికి ఐటీ కోర్ టీం SI నాయబ్ రసూల్ నాయకత్వం వహించారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పర్యాటక, దేవస్థానాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి ప్రజలను మోసం చేస్తుండగా, NCRP సమన్వయ పోర్టళ్ల సహాయంతో వారి బ్యాంకు వివరాలు పరిశీలించగా, మొత్తం 127 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు దాఖలయ్యాయని తేలింది. మొత్తం రూ.46 లక్షల వరకు మోసం చేసినట్లు పోలీసులు చివరకు తేల్చేశారు.
Also Read: Vande Bharat HQ: వందే భారత్ హెడ్ క్వార్టర్ సెట్.. ఇక్కడి నుండే ఇకపై అన్నీ.. ఎక్కడంటే?
ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసుల బృందం రాజస్థాన్‌లోని దిగ్ జిల్లాలోని సహసన్ ప్రాంతానికి వెళ్లి, జూలై 23, 2025, సాయంత్రం 7:30 గంటలకు నిందితులను అరెస్టు చేశారు. పరంజీత్ వద్ద నుండి OPPO F27 PRO 5G మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులతో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయస్థానం ముద్దాయిలను హాజరు పరిచి ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అలాగే నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు బాపట్ల పోలీసులు తెలిపారు.
ఈ కేసు ఓ సంచలనం.. అరెస్ట్ కూడా సంచలనమే!
అమాయక భక్తులను, పర్యాటకులను ఫేక్ సైట్స్ తో మోసం చేస్తూ సుమారు 50 లక్షలు నిందితులు దండుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక రాష్ట్రం కాదు ఏకంగా 18 రాష్ట్రాలలో వీరిపై కేసులు నమోదయ్యాయి అంటేనే, ఈ కేసు ఒక సంచలనమేనని చెప్పవచ్చు. ఎట్టకేలకు బాపట్ల ఎస్పీ సారథ్యంలో పాపం పండి కాదు కానీ, మోసం పండి ఈ నేరగాళ్లు పోలీసులకు చిక్కారని పలువురు పర్యాటకుల మాట. మొత్తం మీద సంచలన కేసును చేధించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. అలాగే అనధికార వెబ్ సైట్స్ పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఎస్పీ తుషార్ దూడీ!