Khammam Farmer Incident: వ్యవసాయం చేస్తూ.. ఆటో నడుపుతున్న పరశురాం కన్న కూతురికి వైద్యం చేయించలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం బైక్ ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన కూతురికి చికిత్స చేయించలేని స్థితిలో బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికే చేతికందిన కొడుకు చనిపోయిన బాధతో కృంగిపోతూ.. అప్పుల బాధతో జీవనం సాగిస్తున్న ఓ కౌలు రైతు తీవ్ర మనస్థాపంతో మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకి చెందిన జర్పుల పరశురాం మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ.. మరో వైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల కింద పరశురాం కొడుకు సందీప్, కూతురు సింధు బైక్‌పై ఎంసెట్ ఎగ్జామ్ రాసి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. జరిగిన ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే చనిపోగా, సింధు కోమాలోకి వెళ్లింది. ఆమెను హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో చేర్పించి దాతల సహకారంతో 30 లక్షలు ఖర్చు చేసి ఆరు నెలల ట్రీట్‌మెంట్ ఇప్పించారు.
Also Read: టార్గెట్ 2029..!
ఇప్పటికీ ఆమె 50 శాతం మాత్రమే కోలుకోగా… ట్రీట్మెంట్ కోసం ప్రతి నెలా50 వేలు ఖర్చవుతున్నాయి. ఆసుపత్రి ఖర్చుకు ఆప్పులు కూడా చేసాడు. దీంతో అప్పుల బాధ తీర్చలేక ఇటు కూతురు కోలుకోక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను చనిపోయే ముందు భార్య లలితకు ఫోన్ చేసి నా కూతురికి వైద్యం చేయించడానికి నా శక్తి సరిపోవడం లేదని, అలాగే తనను అలా మంచం మీద చూడలేకపోతున్నాను అని లలితకు చెప్పి.. అతను కౌలు చేస్తున్న పోలంలోని బావిలో దూకి పరశురాం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో లలిత అక్కడి స్థానికులను తీసుకుని బావి వద్దకు చేరుకుంది. అక్కడి వెళ్లి చూసే లోగా పరశురాం అప్పటికే చనిపోయాడు. అక్కడి వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.