AP Politics: టార్గెట్ – 2029..! ఇదే తన లక్ష్యమంటూ తేల్చిచెప్పారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. లక్ష్యం రీచ్ అయ్యేందుకు కఠినంగా ఉంటానని.. అవసరమైతే ఎవరినైనా వదులుకుంటానని ప్రకటించి సంచలనం రేపారాయన. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే చేసిన తప్పులు దిద్దుకుంటే ఓకేనని..లేకుంటే అంతే సంగతులంటూ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వరకు సమయం ఉండగానే టీడీపీ అధినేత ఎందుకిలా నేతలకు దిశానిర్దేశం చేశారు..? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి..?
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో..
ఏపీలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుతోంది. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలో కూటమి పాలన ఏర్పాటై ఏడాది పూర్తి అయింది. ఇలాంటి వేళ.. గడప గడపకూ టీడీపీ అంటూ కార్యక్రమం నిర్వహించబోతోంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఈ కామెంట్లే ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.
టార్గెట్ 2029 అని చంద్రబాబు ఎందుకు అన్నారు..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగాయి. అంటే ఇప్పటికి ఏడాది కాలం మాత్రమే ముగిసింది. అయినా సరే.. టీడీపీ అధినేత చంద్రబాబు తన టార్గెట్ 2029 అని ఎందుకు ప్రకటించారు అన్నదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. నిజానికి.. సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం పేరుతో జులై 2 నుంచి నెల రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లనున్నారు టీడీపీ నేతలు. పార్టీలోని కుటంబ సాధికార సారథి- KSS సభ్యులు మొదలు.. పొలిట్ బ్యూరో మెంబర్ల వరకు అన్ని స్థాయిల్లోని నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం.
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్లు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు, చేసిన పనులు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలంటూ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలను ఉద్దేశించి పలు కీలక కామెంట్లు చేశారు చంద్రబాబు. టార్గెట్ 2029 తన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం చాలా కఠినంగా ఉంటానని స్పష్టం చేశారాయన. 2024 ఎన్నికల్లో ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా గెలుపే లక్ష్యంగా టికెట్లు ఇచ్చానని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి.. రాబోయే ఎలక్షన్లలో సైతం ప్రజా మద్దతు ఉన్నవారికి మాత్రమే చోటు ఉంటుందని స్పష్టం చేశారు.
తప్పులు సరిదిద్దుకుంటే ఓకే.. లేదంటే అంతే సంగతులు
ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు తాను నివేదికలు తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి. అన్ని సర్వేలను బేరీజు వేసి మరీ చూస్తున్నట్లు ప్రకటించారు. ఎవరివైనా తప్పులు ఉంటే చెబుతానని.. సరిదిద్దుకుంటే ఓకేనన్నారు. అలాకాదని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంతే సంగతులన్నారు చంద్రబాబు. ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను తాము నిరూపించుకుంటూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలన్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారాయన. ఈ రెండు అంశాలను మేనేజ్ చేస్తూ ముందుకు సాగాలని ఆదేశించారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అధికార పక్షంలో ఉన్నా అంతే జాగ్రత్తగా ఉండాలని సూచించారు చంద్రబాబు. ఈ క్రమంలోనే కొంత మంది ఎమ్మెల్యేలకు పింఛన్ల పంపిణీలో పాల్గొనే ఒపిక సైతం లేదంటూ తప్పుపట్టారాయన. ప్రజా ప్రతినిధులకు ఏవైనా సమస్యలు ఉంటే బయట మాట్లాడవద్దని.. నేరుగా తనకే చెప్పాలని సూచించారు ముఖ్యమంత్రి.
ఎన్నికల్లో డబ్బుతోనే గెలవలేమన్న చంద్రబాబు
అయితే.. పార్టీ విస్తృతస్థాయి సమావేశాల కంటే కొందరికి ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత. ఇలాంటి కార్యక్రమాలకే రాకపోతే.. ఇక నియోజకవర్గాల్లో ఏం తిరుగుతారని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎన్నికల్లో డబ్బుతోనే గెలవగలమని అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదన్నారు టీడీపీ అధినేత. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున ధనాన్ని ఖర్చు చేసిందన్నారు. డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తే కూటమి అధికారంలోకి వచ్చేదే కాదన్నారాయన. కానీ, ప్రజలు అనేక అంశాలను పరిశీలిస్తారని అవే గెలుపును నిర్దేశిస్తాయన్నారు. అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
సోషల్ మీడియా టైంలో మరింత జాగ్రత్త అవసరమని సూచన
ఈ సందర్భంగానే నేతలకు మరికొన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిజం గడప దాటే సరికి అబద్దం ఊరంతా చుట్టి వస్తోందన్న విషయం గ్రహించాలన్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా యుగంలో మరింత అలర్ట్‌గా ఉండాలని సూచించారాయన. 2014-19 మధ్య కాలంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పోయామని అందుకే 2019లో అధికారం చేజారిందన్నారు టీడీపీ అధినేత.
Also Read: 2027లో ఏపీలో ఎన్నికలు?
గతంలో చేసిన తప్పులు, నిర్లక్ష్యం, ఉదాసీనత రాబోయే రోజుల్లో ఏ మాత్రం ఉండొద్దని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో స్పష్టంగా చెప్పారు టీడీపీ అధినేత. మరి.. టార్గెట్ 2029 అంటూ చంద్రబాబు విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయిలో ప్రయత్నిస్తారు అన్నది అతి త్వరలోనే తేలనుందన్న మాట విన్పిస్తోంది.