ATM Theft: స్వేచ్ఛ బ్యూరో: ఏటీఎం క్యాష్ చోరీ కేసులోని మిస్టరీ వీడింది. పథకం ప్రకారం ఈ నేరానికి పాల్పడ్డ తండ్రీకొడుకులను చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఐఎస్ సదన్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14.55 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ గురువారం టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ రావు, సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్ దేవ్ సింగ్ తో కలిసి వివరాలు వెల్లడించారు. ఫిరోజ్ గూడ గౌతమినగర్ నివాసి చిర్ర శ్రీనివాస్ అలియాస్ శ్రీను (42) క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చిర్ర అనీష్ అలియాస్ జాన్ (22), చిర్ర జశ్వంత్ (20)లు అతని కుమారులు. ఈ ఇద్దరు స్విగ్గీలో డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారు.
ఈనెల 23న శ్రీనివాస్ ఎప్పటిలానే డ్యూటీకి వచ్చాడు. క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ లో క్యాష్ కస్టోడియన్‌గా పనిచేస్తున్న బంటుపల్లి సురేష్ తోపాటు మరో ఉద్యోగితో కలిసి ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్ చెయ్యటానికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఈదిబజార్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం వద్దకు వచ్చారు. సురేష్, మరో ఉద్యోగి క్యాష్ డిపాజిట్ చెయ్యటానికి లోపలికి వెళ్లగానే శ్రీనివాస్ వ్యాన్ లో 17లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ తస్కరించి ఓ యువకునితో కలిసి బైక్ పై ఉడాయించాడు. ఈ మేరకు సురేష్ ఫిర్యాదు చెయ్యగా ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించగా బైక్ నడిపిన వ్యక్తి శ్రీనివాస్ కుమారుడు అనీష్ అని తేలింది. ఈ క్రమంలో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో బోయిన్‌పల్లిలోని బ్రోస్ బాయ్స్ హాస్టల్ సమీపంలో శ్రీనివాస్, అనీష్‌లను పట్టుకున్నారు.
Also read: ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?
విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చోరీ చేసినట్టు శ్రీనివాస్ అంగీకరించాడు. తన కుమారులు అనీష్, జశ్వంత్ లతో ప్లాన్ చేసినట్టు చెప్పాడు. దాని ప్రకారం అనీష్‌ను ఈదీ బజార్‌లోని ఎస్బీఐ ఏటీఎమ్ వద్దకు రమ్మని చెప్పినట్టు తెలిపాడు. మిగతా ఉద్యోగులు ఏటీఎంలో నగదు నింపే పనిలో బిజీగా ఉన్నప్పుడు నగదు ఉన్న బ్యాగ్ తీసుకుని అనీష్ బైక్ పై పరారైనట్టు వెల్లడించాడు. ఆ తర్వాత పీర్జాదిగూడ ప్రాంతంలో చిన్న కుమారుడైన జశ్వంత్‌ను కలిసి దొంగిలించిన డబ్బు నుండి 10లక్షలు ఇచ్చి దాచిపెట్టమని చెప్పినట్టు వివరించాడు. మిగిలిన డబ్బుతో వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతూ కొంత మొత్తం ఖర్చు చేసినట్టు చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులు జశ్వంత్‌ను పీర్జాదిగూడలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు, ద్విచక్ర వాహనం, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్న చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సైదాబాబు, ఐఎస్ సదన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సాయి ప్రకాష్ గౌడ్, సబ్ ఇన్‌స్పెక్టర్లు రామారావు, మహేష్ లను డీసీపీ ఖరే కిరణ్ అభినందించారు.
Also read: Khairatabad Ganesh: ఈ సారీ ఖైరతాబాద్ బడా గణేష్ లుక్ ఇదే.. సరికొత్త అవతారంలో గణపయ్య!