Gambling Addict: ఇది మధ్యయుగాల్లో జరిగిన ఘటన కాదు.. ఈ 21వ శతాబ్దిలో ఎవరూ ఊహించని విధంగా ఆ దుష్టుడు వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను కడదాకా క్షేమంగా చూసుకోవాల్సిన ఆ ప్రబుద్ధుడు.. ఆమె శీలంపైనే పందెం కాశాడు. తన మిత్రులతో ఆమెపై అఘాయిత్యం చేయించాడు. భయంతో బిక్కుబిక్కు మంటూ తల్లి వద్దకు వెళ్లిన ఆ బాధితురాలిని.. వెంటాడాడు. మిత్రులను వెంట తీసుకుని ఆమె దగ్గరకు వెళ్లి భౌతిక దాడికి దిగాడు. గాయపరిచాడు. ఆ ప్రబుద్ధుడు ముగ్గురు పిల్లల తండ్రి కూడా. ఈ ఘటన ఉత్తర్రదేశ్‌లో చోటుచేసుకుంది
ఉత్తర ప్రదేశ్‌లోని షాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మహిళకు 2013లో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత అదనపు కట్నం కోసం భర్త, మామలు వేధించారు. ‘నా భర్త తాగుబోతు. గ్యాంబ్లింగ్‌కు బానిసయ్యాడు. ఈ పేకాట, జూదం ఆటలు ఆడి సుమారు ఏడు ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. నేను వెంట తెచ్చుకున్న బంగారు ఆభరణాలను కూడా ఇందుకే అమ్ముకున్నాడు. అంతేకాదు, ఆయన తన మిత్రులతో గ్యాంబ్లింగ్ ఆడుతూ.. నాపై కూడా పందెం కాశాడు. దీన్ని నేను వ్యతిరేకించాను. వెంటనే విమెన్స్ హెల్ప్ లైన్ 112కు ఫోన్ చేశాను. కానీ, ఆ పోలీసులు వచ్చే లోపే వారంతా పారిపోయారు’ అని బాధితురాలు ఓ మీడియా సంస్థకు తెలిపింది.
‘ఆయన మిత్రులతో కూడా నాపై అఘాయిత్యం చేయించాడు. కనీసం నన్ను నీరు కూడా తాగనివ్వలేదు. ఆయన మిత్రుల ముందే నా భర్త దాడి చేశాడు. నేను మా తల్లి గారింటికి వెళ్లాను. సెప్టెంబర్ 4వ తేదీన నా భర్త.. ఆయన మిత్రులతో కలిసి మా అమ్మ ఇంటికి వచ్చారు. నా వేళ్లను విరగ్గొట్టాడు. ఇంటి నుంచి బయటికి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశాడు. నా బట్టలు చించేశాడు. తీవ్రంగా కొట్టాడు. ఆయన ఫ్రెండ్స్ కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. ఈ వ్యవహారం తెలుసుకున్న మా బంధువులు వెంటనే మా అమ్మ ఇంటికి వచ్చి పోగయ్యారు. దీంతో నా భర్త, ఆయన మిత్రులంతా అక్కడి నుంచి పారిపోయారు. నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఉన్న కొద్దిపాటి డబ్బులను వారి కోసం నా భర్త దాచి పెట్టాలని కోరుకుంటున్నాను. నా భర్త, ఆయన ఫ్రెండ్స్ పై యాక్షన్ తీసకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది.
Also Read: Encroachments: కబ్జాల్లో ఘనుడు.. ఈ మాజీ ఐపీఎస్..!!
‘వారు నాతో ఏ విధంగా ప్రవర్తించారో.. ఏయే దాష్టీకాలు చేశారో మీకు చెప్పనైనా చెప్పలేను. అవన్నీ నేను కోర్టులో వెల్లడిస్తా’ అని బాధితురాలు పేర్కొంది.
ఈ ఘటనపై రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా స్పందించారు. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేశామని, దర్యాప్తు మొదలు పెట్టామని వివరించారు. ఆమె తమకు ఫిర్యాదు ఇచ్చిందని తెలిపారు. భర్త పేకాటకు బానిస అయ్యాడని, వారికి ఉన్న భూమిని ఈ పేకాటలోనే పోగొట్టుకున్నాడని వివరించిందని పేర్కొన్నారు. ఆమెను విపరీతంగా కొట్టాడని చెప్పినట్టు వివరించారు.