Gay Men Captive Extortion| ఆన్‌లైన్ లో మోసగాళ్లు విచ్చలవిడిగా జనాలను మోసం చేస్తున్నారు. ముందు ఏదో ఒక ఆశచూపి అమాయకులను ట్రాప్ చేయడం. ఆ తరువాత వారు ఏమీచేయలేని స్థితిలో వేధిస్తూ అందినంత దోచుకోవడం. కానీ ఈ దోపిడీ చేసేవారు ఊహకందని మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికి ధనిక, మధ్య తరగతి, పేద అనే తేడా లేదు. అందరివద్ద దోచుకోవడమే. అయితే తాజాగా ఒక గ్యాంగ్ కొందరు గే పురుషులను (స్వలింగ సంపర్కులను) టార్గెట్ చేశారు. వారికి ప్రేమ పేరుతో వల వేసి కిడ్నాప్ చేశారు. ఆ తరువాత వారి బట్టలు విప్పి మరీ దోచుకున్నారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీసులు ఇటీవల టిండర్ యాప్ ద్వారా స్కామ్, కిడ్నాప్ చేసే ఒక గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసింది. గ్యాంగ్ లోని అయిదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వీరంతా సామాన్యులను కాదు గే పురుషులను టార్గెట్ చేసేవారు. పట్టుబడ్డ అయిదుగురిలో ఒకడు మైనర్ కావడంతో చాలా షాకింగ్ విషయం. జనవరి 10న ఢిల్లీ పోలీసులు టిండర్ యాప్ ద్వారా స్కామ్ చేసి పురుషులను కిడ్నాప్ చేసే గ్యాంగ్ సభ్యులైన అర్జున్ (24), నితిన్ (23), ఆకాశ్ (24), ఫైజాన్ (19), ఒక మైనర్ ని అరెస్ట్ చేశారు.
Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్
పోలీసులు కథనం ప్రకారం.. ఈ గ్యాంగ్ సభ్యులంతా ముందుగా టిండప్ డేటింగ్ యాప్ ద్వారా పురుషులను టార్గెట్ చేసేవారు. ముఖ్యంగా పురుషులతో మాత్రమే స్నేహం చేసేవారిని గుర్తించి వారిని సంప్రదించేవారు. వారిని ప్రేమించే మరో గే పురుషుడిగా ఈ గ్యాంగ్ సభ్యులలో ఒకరు పరిచయం చేసుకునేవారు. ఆ తరువాత టార్గెట్ ని డేటింగ్ కోసం పిలిచి అందరూ కలిసి కిడ్నాప్ చేసేవారు. కిడ్నాప్ చేసిన తరువాత ఒక నిర్మానుష ప్రాంతంలో బంధించి.. బట్టలు విప్పదీసేవారు. అతడి వద్ద ఉన్న డబ్బులన్నీ దోచుకునేవారు. అంతేకాదు బాధితుడి మొబైల్ లోని ఫోన్ పే, గూగుల్ పే లలో అతని చేతనే లాగిన్ చేసి.. ఇతర అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేవారు. డబ్బులు పూర్తిగా వారి చేతికి వచ్చిన తరువాత విడుదల చేసేవారు.
తాజాగా ఒక రోహన్ అనే ఒక స్వలింగ సంపర్కుడిని వీరంతా టార్గెట్ చేశారు. టిండర్ లో అంకిత్ అనే పేరుతో ఫ్రొఫైల్ క్రియేట్ చేసి అతడితో చాటింగ్ చేశారు. ఆ తరువాత అతడిని ఢిల్లీలోని ప్రతాప్ నగర్ గోకల్ పూరి మెట్రో స్టేషన్ వద్దకు ఒక రెస్టారెంట్ లో కలుసుకునేందుకు పిలిచారు. బాధితుడు చాటింగ్ లో ఉన్నదాని నమ్మి.. అక్కడికి వెళ్లాక అతడిని ఈ గ్యాంగ్ సభ్యులు కత్తితో బెదిరించి తమ రహస్య స్థలానికి తీసుకెళ్లారు ఆ తరువాత అతడి బట్టలు విప్పి అతడి ఫోన్ పే లో నుంచి మొత్తం రూ.1.25 లక్షలు దోచుకున్నారు. రెండు రోజుల పాటు అతడిని బట్టలు లేకుండా అదే గదిలో బంధించి.. వారు పూర్తిగా డబ్బులు దోచుకున్నాక బాధితుడిని విడుదల చేశారు.
అయితే ఆ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు జరిగినదంతా చెప్పాడు. దీంతో పోలీసులు అతడి టిండర్ యాప్ ద్వారా గ్యాంగ్ వరకు చేరుకున్నారు. గ్యాంగ్ సభ్యుల వద్ద నుంచి పోలీసులు బాధితుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తానికి నితిన్ మాస్టర్ మైండ్ అని తెలిసింది. ఢిల్లీలోని హర్ష్ విహార్ పోలీస్ స్టేషన్ లో ఈ గ్యాంగ్ సభ్యులపై కేసు నమోదు చేశారు.