Daaku Maharaj.. 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా బడా హీరోలు తమ సినిమాలతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే జనవరి 10వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) భారీ అంచనాలతో ఏకంగా రూ.450 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటిరోజు రూ.186 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిందని మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా ఖాళీ సీట్లే కనిపించాయి. అలాంటిది ఈ సినిమా ఎలా ఇంత కలెక్షన్స్ వసూలు చేస్తుంది.. ఇది ఫేక్ కలెక్షన్స్ అంటూ కొట్టి పారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ను బాలకృష్ణ (Balakrishna) మూవీ’ డాకు మహారాజ్ ‘ (Daaku Maharaj) బ్రేక్ చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటో కాస్త చూద్దాం.
వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య..
నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అటు రాజకీయపరంగా ఇటు సినిమాలలో వరుస హ్యాట్రిక్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య, ఈసారి కూడా సంక్రాంతి బరిలో దిగి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పించకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం ఈ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి రేస్ లో నిలిచి జనవరి 12వ తేదీన విడుదల అయ్యింది.
తొలిరోజు గేమ్ ఛేంజర్ రికార్డు బ్రేక్ చేసిన డాక్ మహారాజ్..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. డాకు మహారాజ్ సినిమాలకు ఏపీ, తెలంగాణలో బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ కూడా ఉదయం 8 గంటలకు షో ప్రారంభం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాత్రి 7:15 గంటల వరకు దాదాపు 15 కోట్ల రూపాయలను వసూలు చేసింది. జనవరి 10వ తేదీన విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా రాత్రి 7:15 గంటల వరకు కేవలం రూ.12.40 కోట్లు మాత్రమే సంపాదించింది. దీన్ని బట్టి చూస్తే గేమ్ ఛేంజర్ తొలి రోజు రికార్డును డాకు మహారాజు బ్రేక్ చేసిందని చెప్పవచ్చు
డాకు మహారాజ్ విశేషాలు..
డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రగ్యా జేస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ రౌతేలా తదితరులు నటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించగా.. ఈ సినిమాకి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.