Bank Locker Heist| సినిమాల్లో లాగా కొంతమంది దొంగలు పక్కా ప్లాన్ వేసి ఒక బ్యాంకులో కన్నం వేశారు. ఏ మాత్రం ఆధారాలు లేకుండా.. ఎవరూ పసిగట్టకుండా రాత్రంతా బాగా తాపీగా దోచుకున్నారు. మరుసటి రోజు అంతా అయిపోయాక ఉదయం బ్యాంకు సిబ్బంది లోపల జరిగింది చూసి తలలు పట్టుకున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ సూరత్ నగరంలో సోమవారం డిసెంబర్ 16, 2024న రాత్రి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూరత్ బ్రాంచ్ లో లాకర్ రూమ్ గోడకు దొంగలు రెండు అడుగుల ఎత్తు, వెడల్పు ఉన్న కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. లాకర్ రూమ్ లో వెళ్లాక.. బ్యాంకు వాల్ట్, లాకర్లను ఎలెక్ట్రిక్ కట్టర్ తో కట్ చేశారు. అంతకంటే ముందే బ్యాంక్ లోపల నుంచి అలారం మోగకుండా ఉండేందుకు దాని వైర్లు కట్ చేశారు. సిసిటివి కెమెరాల కనెక్షన్ కట్ చేశారు.
ఆ తరువాత కులాసాగా బ్యాంకు లోపల తింటూ, తాగుతూ మొత్తం 70 లాకర్లలో 6 లాకర్లు మాత్రమే పూర్తిగా ఖాళీ చేశారు. ఆ లాకర్లలో చాలా ధనం, బంగారం ఉండేదని.. ఆ మొత్తం దోచేసుకున్నారిన తెలిసింది. మంగళవారం ఉదయం వరకు దొంగతనం సాగించి.. తాపీగా ఉడాయించారు.
Also Read: రూ.20 కే పెళ్లికూతురు.. ఆ ఊరెళితే తక్కువ ధరకే పిల్లనిస్తారు!
ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చాక.. చూస్తే.. బ్యాంకు లోపల దొంగలు అక్కడ కూర్చొని తిని పడేసిన చెత్త, మందు గ్లాసు ఉన్నాయి. లాకర్ రూమ్ లో అంతా ధ్వంసమై ఉంది. దీంతో బ్యాంకు సిబ్బంది ఖంగు తిని కొసాంబా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందున్న పోలీసులు డాగ్ స్వాడ్ తో అక్కడికి చేరుకున్నారు. బ్యాంకు బయట సెక్యూరిటీ గార్డ్ కూడా కాపలా లేడు. బ్యాంకులో ఎంత మొత్తం దొంగతనం జరిగిందో ఇంకా పూర్తిగా లెక్క తేల లేదు.
బ్యాంకు లోపల సిసిటీవిలు.. దొంగలు నాశనం చేశారని.. పరిసరాల్లో సిసిటీవి వీడియోలను పరిశీలిస్తున్నామని సూరత్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు.
నెల రోజుల క్రితం కూడా కర్ణాటకలో ఇలాంటి దొంగతనమే జరిగింది. బ్యాంకు లాకర్ నుంచి దాదాపు 17 కిలోల బంగారు ఆభరణాలు దొంగతనం జరిగాయి. అక్టోబర్ 25 2024 రాత్రి దొంగలు బెంగుళూరు నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యామతి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో కిటికీలు పగులగొట్టి ప్రవేశించారు. ఆ బ్యాంకు లో మొత్తం 932 కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. దీంతో బ్యాంకు లోపల భారీ మొత్తంలో బంగారం ఉంది.
బ్యాంకు లోపల ప్రవేశించిన దొంగలు దాదాపు 509 మంది కస్టమర్లకు చెందని 17.705 కిలోల బంగారు ఆభరణాలను దోచుకొన్ని పారిపోయారు. బంగారం విలువ దాదాపు రూ.13 కోట్లు. అయితే పారిపోయే ముందు బ్యాంకు లోపల ఉన్న అన్ని సిసిటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. దొంగతనం విషయం తెలిసి కస్టమర్లు తమ బంగారం సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చారు. కానీ పోలీసులు బ్యాంక్ ని సీజ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. దొంగలు ఇంతవరకు పట్టుబడలేదు.