Goriya Tribe Wedding| ఒక పెళ్లి సెట్ అవ్వాలంటే.. రెండు కుటుంబాలు కలిసి, తాంబూలాలు మార్చుకొని, ఎవరికెన్ని ఆస్తులున్నాయి? మా అమ్మాయిని బాగా చూసుకుంటారా? ఫ్యూచర్‌లో మా పిల్లకు ఏమైనా కష్టాలొస్తాయా? ఇలా వంద ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం ఆనవాయితీ. కానీ ఈ ఊళ్లో మాత్రం ఇంత తతంగం ఉండదు. ఎవరైనా అబ్బాయి.. ఈ ఊళ్లో పిల్లని పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయి ఫ్యామిలీని కలుస్తాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒక ఇరవై రూపాయలు తీసి కాబోయే అత్తమామలకు ఇస్తాడు. ఇక అంతే.. వాళ్లిద్దరి పెళ్లి దాదాపు అయిపోయినట్లే. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ పెళ్లిళ్లు ఈ కాలంలో కూడా జరుగుతూనే ఉన్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే అర్జెంటుగా ఛత్తీస్‌గఢ్‌లోని ధంతారి ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందే.
ఇక్కడి భటగావ్ అనే గ్రామంలో గొరియా తెగకు చెందిన వారు చాలా ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నారు. అమ్మాయి, అబ్బాయిల కుటుంబాలు కలిసిన తర్వాత పెళ్లి ఫిక్స్ చేసుకోవడానికి.. వీళ్ల పూర్వీకులు ఎప్పుడో పురాతన కాలంలో ఇలా రూ.20 లు చెల్లించాలనే రూల్ పెట్టారంట. ఇప్పటికీ ఇక్కడ ఇదే రేటు నడుస్తోంది. అయితే కొందరు మాత్రం రూ.500 వరకు చెల్లించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని ఇక్కడి తెగవాళ్లు తెగ సంతోషంగా చెప్తున్నారు. ఈ అమౌంట్ కనుక అమ్మాయి తల్లిదండ్రులకు ఇచ్చేస్తే.. ఇక పెళ్లి కూతుర్ని అబ్బాయి తన వెంట తీసుకెళ్లిపోవచ్చు. అయితే ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం ఉండాలండోయ్. రూల్ వింతగా ఉన్నా ఇది పెళ్లి కదా మరి.
Also Read: ఒక కప్పు టీ ధర రూ.లక్ష.. అంతా బంగారమే!
ఈ ఆచారం గురించి గొరియా తెగకు చెందిన మేలా బాయ్ అనే 50 ఏళ్ల మహిళ మాట్లాడుతూ.. ‘మాది కనేరి గ్రామం. అప్పట్లో నన్ను చూడటానికి పెళ్లి వాళ్లు వచ్చినప్పుడు.. 60 రూపాయలకు మా పెళ్లి ఫిక్స్ అయింది. ఈ ఆచారాన్నీ మేము ‘సుఖ బంధనా’ అని పిలుస్తాం. అప్పట్లో మా పెళ్లి మూడ్రోజులు జరిగింది. ఈ పెళ్లిని 60 రూపాయలకు ఫిక్స్ చెయ్యడానికి రెండు వైపులా పెద్దవాళ్లు ఒప్పుకున్నారు. ఒక వేళ మా ఆయన వేరే అమ్మాయిని చేసుకుందామని అనుకుంటే.. నన్ను మా ఇంట్లో వదిలేస్తాడు. అప్పుడు మా అమ్మానాన్న.. పెళ్లి కుదిరినప్పుడు తమకు ఇచ్చిన 60 రూపాయలను తిరిగిచ్చేయాలి’ అని వివరించింది. కొంతకాలం వెనక్కు వెళ్తే ఇక్కడి పెళ్లిళ్లన్నీ ఇలాగే జరిగేవట. కానీ ఇప్పుడు కాలం మారింది కదా. దాంతో చాలామంది ఈ సంప్రదాయాలు పాటించడం లేదని, కానీ కొందరు మాత్రం ఇప్పటికీ ఇలాగే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని దిన్‌బతీ బాయ్ అనే మరో మహిళ తెలిపింది.
అసలేంటీ ఆచారం?
ఈ 20 రూపాయలకే పెళ్లి అనే ఆచారాన్ని గొరియా తెగ వాళ్లు చాలాఏళ్లుగా ఆచరిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతిలో అమ్మాయి తల్లిదండ్రులకు ఇచ్చే డబ్బు ఒక విధంగా డిపాజిట్ లాంటిదట. ఆ డబ్బు ఎప్పటికీ వాళ్ల దగ్గరే ఉండిపోతుంది. ఒక వేళ అమ్మాయి తరఫు వాళ్లు కానీ, అబ్బాయి తరఫు వాళ్లు కానీ ఏ కారణంతోనైనా పెళ్లి బంధం తెంచుకోవాలని అనుకుంటే.. అప్పుడు ఈ డిపాజిట్ సొమ్మును తిరిగిచ్చేస్తారంట. ఈ డబ్బు ఇచ్చిన తర్వాతనే అమ్మాయిని తిరిగి పుట్టింటికి తీసుకెళ్లాలనేది వాళ్ల రూల్. ఒకవేళ పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఒప్పుకుంటే.. పెళ్లి చెయ్యడానికి మూడేళ్ల వరకు ఆగే ఛాన్స్ కూడా ఉందని దిలేష్ గొరియా అనే వ్యక్తి చెప్పారు.
ఇదొక్కటే కాదు.. ఇలాంటి చాలా వింత రూల్స్ ఉన్నాయీ గొరియా తెగలో. వీళ్ల తెగలో అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి కుదిరితే.. వాళ్లిద్దర్నీ కలిపి ఒకే గదిలో పెట్టి తాళం పెట్టేస్తారు. కొన్నిరోజులపాటు వాళ్లిద్దరూ ఆ గదిలో ఉన్న తర్వాత తాళం తీస్తారట. ఇదేంటంటే.. అలా చేస్తేనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారని, ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేసేస్తే సమస్యలేవీ రావని వాళ్లు చెప్తారు.
ఈ ఆచారాల గురించి స్థానిక స్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్న దినేష్ కుమార్ పాండే వివరిస్తూ.. ‘అమ్మాయి, అబ్బాయికి చెందిన రెండు కుటుంబాలు ఒప్పుకుంటేనే ఈ తెగలో పెళ్లి జరుతుంది. ఆ అబ్బాయి, అమ్మాయి విడిపోతే.. పెళ్లి టైంలో ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తారు. పెళ్లి కూడా వీళ్ల క్యాంపులోనే చేసుకుంటారు. ఒకప్పుడు పెళ్లిళ్లు జస్ట్ 20 రూపాయలకే జరిగేవి. కానీ ఇప్పుడు ఆ రేటు 500 రూపాయల వరకు పెరిగింది’ అని చెప్పారు. ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్‌లో ప్రపంచం మొత్తాన్ని చూసేస్తున్న ఈ రోజుల్లో కూడా గొరియా తెగ తమ సంప్రదాయం కొనసాగించడమే ఆశ్చర్యం అనుకుంటే.. కొత్త తరం కూడా దాన్ని స్వీకరించడం ఇంకా ఆశ్చర్యకరం కదా!