Hyderabad Robbery | హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ ప్రాంతంలో ఒక ఇంట్లో నుంచి రూ.2 కోట్లు విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు దొంగతనం జరిగాయి. ఇంటి ఓనర్ విదేశాల్లో ఉండడంతో దుండగులు సునాయసంగా పనికానిచ్చేశారు. అయితే దొంగతనం చేసిన వారు ఆ ఇంట్లోనే నివసించేవారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నారాయణగూడలో సొంత ఇల్లు కలిగిన ఓ వ్యక్తి ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నాడు. అయితే హైదరాబాద్ లోని తన ఇంట్లో కొంతకాలం క్రితం ఇద్దరు పనిమనుషులను నియమించాడు. వారిద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందని దంపతులు. కొన్ని రోజుల క్రితం యజమాని హైదరాబాద్ వచ్చినప్పుడు తన ప్రైవేట్ గదిలోపలికి తాళం వేసి.. ఆ గదిలో ఎవరూ వెళ్లకూడదని చెప్పి ఆదేశించి తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి ఇంటి పనిచేసే ఆ బిహార్ దంపతులకు ఆ గదిలో ఏదో విలువైన వస్తువులు ఉన్నాయనే అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో పనిమనుషులైన ఆ భార్యభర్తలిద్దరూ ఆ గది తాళాలు పగలకొట్టి వెళలి చూడగా.. అక్కడ రహస్యంగా ఓ లాకర్ ఉంది. దాన్ని పగులకొట్టి చూస్తే.. అంతా బంగారు, డైమండ్ నగలు ఉన్నాయి. వాటిని కాజేసి ఆ బిహార్ దంపతులు పరారయ్యారు. ఈ విషయం ఇటీవలే తెలుసుకున్న ఇంటి యజమాని నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి.. దొంగలను పట్టుకోవడం కోసం.. నగరంలోని సిసిటీవీ వీడియోలు జల్లెడవేస్తున్నారు.
Also Read: ఫైనాన్స్ కంపెనీలో రూ.1.15 కోట్లు కాజేసిన ఉద్యోగి.. ఎంత తెలివిగా చేశాడంటే
సోషల్ మీడియా పిచ్చి కోసం దొంగతనాలు..
ఇలాంటిదే మరో కేసు రాజధాని ఢిల్లీలో గత సంవత్సరం జూలైలో జరిగింది. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిచేసే నీతూ అనే 30 ఏళ్ల మహిళకు సోషల్ మీడియా పిచ్చి. ఆమె ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో తన డాన్స్ వీడియోలు, రీల్స్ చేయాలని ఎంతో ఆశపడింది. అందుకోసం మంచి కెమెరాల కావాలని నిర్ణయించుకుంది. స్నేహితులను సంప్రదించగా.. నికాన్ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మంచి క్లారిటీ ఉన్న వీడియోలు వస్తాయని సూచించారు. దీంతో ఆమె ఆ కెమెరా కొనుగోలు చేయాలని భావించినా.. దాని ధర చూసి తన వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఎలాగైనా డబ్బు సాధించాలని భావించింది.
ఈ క్రమంలో తాను పనిచేస్తున్న ఇంట్లో ఉన్న బంగారు నగలపై ఆమె కన్ను పడింది. అదును చూసి ఆ నగలు కాజేసి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో నీతు మొబైల్ ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ఆమె ఇంటి యజమానులకు ఆమె ఇచ్చిన అడ్రస్ కూడా ఫేక్ అని తేలింది. దీంతో పోలీసులు నగరంలోని సిసిటీవి వీడియోలు పరిశీలిస్తూ.. ఆమె నివసించే ప్రాంతానికి చేరుకున్నారు. నీతూ ఒక బ్యాగులో నగలు దాచుకొని పారిపోతుండగా… ఆమెను పట్టుకున్నారు. విచారణలో నీతు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువతిగా తెలిసింది.
తన భర్త డ్రగ్స్ కు అలవాటు పడి సంపాదన లేక తనను రోజూ కొట్టేవాడని.. అతడి నుంచి తప్పించుకొని పారిపోయి ఢిల్లీలో ఇంటి పనిమనిషి ఉద్యోగం చేసుకుంటున్నానని తెలిపింది.