Actress : ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా (Maha Kumbhamela 2025) భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి త్రివేణి సంగమంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కన్నడ నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar) మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూశాక “నీలో ఈ కోణం కూడా ఉందా?” అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు.
మహా కుంభమేళాలో కస్తూరి శంకర్
2025 జనవరి 13 నుంచి ప్రయోగ్ రాజ్ లో ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరుగుతుంది. ఈ ప్రత్యేక పండుగ సందర్భంగా ఇప్పటికే సినీ ప్రముఖులు ఎందరో మహాకుంభమేళాలో ప్రత్యక్షమయ్యారు. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా కావడంతో దీనికి ప్రాముఖ్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే త్రివేణి సంగమంలో పుణ్యా స్నానాలు ఆచరిస్తున్నారు.
తాజాగా “హర హర మహాదేవ్ ! జై గంగా… ఇది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని అనుభవం, నా జన్మ ధన్యమైంది” అంటూ పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది కస్తూరి శంకర్ (Kasthuri Shankar). ఈ అమ్మడు తన కొడుకుతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్ళింది. ఆమె షేర్ చేసిన ఫోటోలలో కొడుకు కూడా కన్పిస్తున్నాడు.
టాలీవుడ్ పై వివాదాస్పద కామెంట్స్
‘అన్నమయ్య’ మూవీతో తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరైన కస్తూరి శంకర్ (Kasthuri Shankar) కు చాలా కాలంగా అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే పలు సీరియల్స్ చేస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ ఎప్పటికప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది నవంబర్ 4న తమిళ బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కస్తూరి తెలుగు వాళ్ళపై అనుచిత కామెంట్స్ చేసింది. “300 ఏళ్ల కిందట అంతఃపురంలో రాజ మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్ళు” అంటూ నోరు జారి చిక్కుల్లో పడింది. అక్కడితో ఆగకుండా “అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాత్రం మేము తమిళులమే అంటూ ఓవర్ గా మాట్లాడుతున్నారు” అంటూ వివాదంలో పడింది.
కస్తూరి ఎందుకు ఇంతటి వివాదాస్పద కామెంట్స్ చేసిందో తెలియదు. కానీ ఆమె వ్యాఖ్యలపై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో, పోలీసులకు కన్పించకుండా పరార్ కూడా అయింది. ఆ తర్వాత కస్తూరి ‘సారీ’ చెప్పినప్పటికీ తెలుగు వాళ్ళు శాంతించలేదు. దీంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక జైలుకు వెళ్లాక బెయిల్ పై ఈ అమ్మడు నవంబర్ 21న బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కస్తూరి శంకర్ (Kasthuri Shankar) మహా కుంభమేళా (Maha Kumbhamela 2025)లో పుణ్యస్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో “నీలో ఇలాంటి కోణం కూడా ఉందా ?” అంటూ మరోసారి ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజెన్లు.