Suryapet News : సూర్యాపేటలో దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్య చనిపోవడంతో పరాయి మహిళతో సహజీవనం చేస్తున్న ఓ ప్రబుద్ధుడు.. ఆమె కూతుళ్లపై సైతం అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి స్థానంలో ఉండి కూడా ఆడపిల్లలపై దారుణానికి పాల్పడిన ఈ దుర్మార్గుడు.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గుడికి హెచ్ఐవీ పాజిటీవ్ గా తేలడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో.. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
సూర్యాపేటకు చెందిన జాటోత్ సునీల్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పది మందికి సంస్కారం, విలువలు చెప్పాల్సిన ఈ వ్యక్తి.. కనీస సమాజ విలువలు లేకుండా ప్రవర్తించాడు. మనిషి అని మర్చిపోయి, మృగంలా మారిపోయాడు. తన భార్య చనిపోవడంతో స్థానికంగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళ సైతం.. భర్తను విడిచిపెట్టి నగరానికి వచ్చి ఉంటోంది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారంతో సూర్యపేటలో నివసిస్తుండగా, ఆ మహిళకు దగ్గరైన సునీల్ కుమార్.. తరచూ వాళ్లింటికి వచ్చి వెళ్తుండే వాడు.
సునీల్ కుమార్ వ్యవహారం 2018 నుంచి నడుస్తోంది. భర్త తోడు లేకుండా సిటీలో ఉంటున్న మహిళ కూడా అతనిపై ఆధారపడి ఉండడంతో.. వ్యవహారం సాగిపోతుంది. కానీ.. ఈ దుర్మార్గుడు.. తనలోని నీచత్వాన్ని బయటపెట్టుకున్నాడు. సదరు మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె ఇద్దరు ఆడపిల్లలు వరుసకు కూతుళ్లు అవుతారనే ఇంగిత జ్ఞానం కోల్పోయాడు. తల్లి ఇంట్లో లేని సమయాల్లో వారిని లొంగదీసుకున్నాడు. వారిపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూ.. ఆ విషయం వారి తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో.. ఆ బాలికలు ఈ దారుణాన్ని వాళ్లమ్మకు చెప్పకుండా ఆగిపోయారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈ వ్యక్తి.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతే కాక.. ఆ బాలికలకు 19, 15 ఏళ్ల వయసే కావడం గమనార్హం. చిన్న వయసులోని బాలికల్ని, తండ్రి స్థానంలోని వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఎవరూ ఊహించలేదు. కానీ.. ఇలాంటి ఘటన జరగడంతో అంతా సునీల్ కుమార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
నిందితుడికి ఎయిడ్స్ నిర్థరణ..
బాలికలపై దారుణానికి పాల్పడిన ప్రబుద్ధుడికి ఎయిడ్స్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్న సునీల్ కుమార్ కు హెచ్ఐవీ ఎయిడ్స్ సోకినట్లుగా తెలిసింది. ఈ విషయం బాలికలకు తెలియడంతో తీవ్రంగా బయటపడిపోయారు. తనకూ ఆ వ్యాధి సొకుతుందని ఆందోళన చెందారు. దాంతో.. వారిపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న దారుణాన్ని తల్లి దృష్టికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న తల్లి ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్లు తనకు తెలియకుండా జరుగుతున్న దారుణానికి ఉలిక్కిపడింది. ఆ దుర్మార్గుడిని ఎలాగైనా శిక్షించాలని, అతడు చేసిన దారుణాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.దాంతో.. పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. పోక్సో యాక్ట్ కింద అతనిపై పలు సెక్షన్లు మోపారు.
Also Read : అలెర్ట్.. ఇంటర్ ఇంగ్లిష్ పేపర్‌లో మార్పులు.. ఆందోళనలో స్టూడెంట్స్..