Sirisha’s Murder Mystery: హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ శిరీష మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్తే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి భర్త వినయ్‌తో పాటు అతడి సోదరి సరితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ సోదరి సరిత హత్యకు ముందు శిరీషతో గొడవకు దిగినట్లు తెలిసింది. శిరీషను హత్య చేసిన అనంతరం.. ఆమెకు గుండె పోటు వచ్చినట్లు డ్రామా ఆడారు. హత్యను కప్పిపుచ్చేందుకు శిరీష మృతదేహాన్నివినయ్, సరిత ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిరీష గుండెపోటు వల్ల మరణించలేదని, ఎవరో కొట్టి చంపినట్లు స్పష్టం ఉందని పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడయింది.
చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించటంతో చిన్న కూతురు శిరీషను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరంగా ఉంచింది. దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో పాప జన్మించింది.
పెళ్లయిన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు భార్య సోదరి స్వాతికి.. ఫోన్ చేసి, శిరీష ఛాతి నొప్పితో మరణించినట్టు సమాచారమిచ్చాడు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేట్‌లోని మేనమామ మధుకర్‌కు చెప్పింది. ఆయన శిరీష నంబరుకు ఫోన్ చేసి, అట్నుంచి మాట్లాడిన మహిళతో తానొచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని సూచించాడు. అనంతరం పలుమార్లు ఫోన్‌చేసినా స్పందించకపోవటంతో ఆసుపత్రిలో సంప్రదించాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్తున్నట్లు వారు సమాచారమిచ్చారు.
ఆసుపత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి.. ఆరా తీయటంతో మృతదేహాన్ని నాగర్‌కర్నూలు తరలిస్తున్నట్లు చెప్పాడు. దోమలపెంట సమీపంలో ఉన్నట్టు తెలిపాడు. నగర పోలీసుల సాయంతో అంబులెన్స్ డ్రైవర్, వినయ్‌తో ఫోన్‌లో మాట్లాడించి మృతదేహాన్ని మార్చి 3వ తేదీన నగరానికి రప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read: కాంగ్రెస్ కార్యకర్త హిమాని హత్య కేసు.. సీసీ టీవీలో కీలక దృశ్యాలు
శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి.. మృతురాలి బంధువులు వినయ్‌ను నిలదీయగా, పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినపుడు CPR చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గుచ్చుకొని ఉండవచ్చని ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు గాయాలైనట్టు మరోసారి చెప్పాడు. వినయ్ ఇచ్చిన సమాధానాలతో అనుమానం కలిగిన పోలీసులు వినయ్, అతడి సోదరిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించి అసలు విషయం బయటకు లాగారు. తాజాగా వచ్చిన పోస్టు మార్టం రిపోర్టుతో మర్డర్ మిస్టరీ వీడిపోయింది.