Hyderabad crime: హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసిన ఓ దారుణ ఘటన.. పన్నెండేళ్ల చిన్నారి హత్య. ఇంకా బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో.. కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోయింది. తనకు ఏం జరుగుతోందో కూడా అర్థం కాని అమాయకం.. ఒక్కసారిగా బలి అయిపోవడంతో స్థానికులు, తల్లిదండ్రులు, బంధువులు కంటతడి పెట్టారు. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోయిన క్షణాన్ని టార్గెట్ చేసి దుండగులు చేసిన ఈ దారుణం.. ఒక చిన్నారి ప్రాణం ఇలా పోయిందంటే మనం ఎక్కడ సురక్షితంగా ఉన్నాం? అనే ప్రశ్నను ప్రతీ ఒక్కరి ముందుకు తెచ్చింది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సంగీత్ నగర్‌లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. సహస్ర అనే 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి హత్య కు దారి తీసిన కారణాలు, దుండగుల జాడ కనిపెట్టే పనిలో పడ్డారు.
ఎలా వెలుగులోకి వచ్చింది?
సాధారణంగా ప్రతి రోజు లాగే సహస్ర తండ్రి కృష్ణ తన బైక్ మెకానిక్ షాపుకి వెళ్లాడు. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంది. వారు పనులకై బయటకు వెళ్లగా, చిన్నారి సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తండ్రి, కూతురికి బాక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్లాడు. కానీ ఇంట్లో ఎదురైన దృశ్యం చూసి షాక్‌లోకి వెళ్లిపోయాడు. బెడ్‌పై రక్తపు మడుగులో పడి ఉన్న తన కూతురి శవాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
పోలీసుల దర్యాప్తు
అతను వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికే చేరుకుని సీన్ ఆఫ్ క్రైమ్‌ను పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం కూడా చేరి ఆధారాలు సేకరించింది. చిన్నారిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల వేదన
బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు. ఇంట్లో మేము లేని టైంలో ఇలా జరిగిపోయింది.. మా కొడుకు కూడా ఇంట్లో ఉన్నాడంటే ఆయనను కూడా చంపేసేవారు అంటూ కుటుంబ సభ్యులు వేదన వ్యక్తం చేస్తున్నారు. పాపను చూసి విలపిస్తున్న తల్లిదండ్రులను చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read: AP Airport: ఏపీలోని ఆ ఎయిర్ పోర్ట్ ఒక రికార్డ్.. అందరి చూపు అటువైపే!
స్థానికుల ఆగ్రహం
ఈ ఘటన విషయం తెలిసి ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో సహస్ర ఇంటికి చేరుకున్నారు. ఒక చిన్నారి ప్రాణం ఇలా పోయిందంటే భద్రతా పరిస్థితులు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు నేరస్థులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుమానాలపై దర్యాప్తు
ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎవరైనా తెలిసిన వారి పని కావచ్చా? లేకపోతే దొంగతనానికి ప్రయత్నించి హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బాలిక శరీరాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఒక చిన్నారి ప్రాణం ఇలా క్రూరంగా పోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పిల్లలను కాపాడటం కోసం తల్లిదండ్రులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్న అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేస్తోంది. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నగరం మధ్యలో ఇలాంటి దారుణం జరగడం పట్ల అందరూ షాక్‌కు గురవుతున్నారు. అమాయక సహస్ర ప్రాణం పోయినా.. ఆమెకు న్యాయం జరగాలన్నది ఒక్కటే స్థానికుల కోరిక. పోలీసులు వేగంగా విచారణ చేసి అసలు నిందితులు ఎవరో పట్టుకోవాలన్నది ప్రస్తుతం ప్రజల ఆశ.