Maoist : మొన్న కంబాల కేశవరావు. ఇప్పుడు సుధాకర్. మావోయిస్టు పెద్ద తలకాయలన్నీ వరుసగా నేలకొరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతి నుంచి కోలుకోకముందే.. కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం మరో ఎదురుదెబ్బ.
తెలుగోడే ఆ కామ్రేడ్.. రూ.కోటి రివార్డు..
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జాతీయ పార్క్‌లో ఉదయం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత సుధాకర్ హతమయ్యారు. ఏలూరు జిల్లా చింతపూడి మండలం ప్రగడవరంకు చెందిన సుధాకర్ అసలు పేపరు తెంటు లక్ష్మీనరసింహాచలం. 40 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 65. వైఎస్సార్ హయాంలో 2004లో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఉద్యమంలో మరింత ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రభుత్వం ఆయన తలకు రూ.కోటి రివార్డు ప్రకటించింది.
పక్కా ఇన్ఫో..
బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు మరికొందరు సాయుధ మావోయిస్టులు ఉన్నట్టు తెలీడంతో వారికోసం.. DRG, STF , కోబ్రా టీమ్స్ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
డెడ్‌లైన్ ఫిక్స్
2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. అన్నట్టుగానే ఆపరేషన్ కగార్‌తో భద్రతా బలగాలు మావోయిస్టులను ఏరిపారేస్తున్నాయి. ఇటీవల కర్రెగుట్టలను రౌండప్ చేసి.. వారాల తరబడి కూంబింగ్ జరిపి.. 40 మందికి పైగా మావోయిస్టులను హతమార్చారు. ఆ తర్వాత అబూజ్‌మడ్‌పై పంజా విసిరి మావోయిస్టు పార్టీ చీఫ్ కంబాల కేశవరావును ఎన్‌కౌంటర్ చేశారు.
హిడ్మా ఎక్కడ?
చనిపోయే ముందు కంబాల రాసిన లేఖలో ప్రస్తావించినట్టే జరుగుతోంది. సహచరులారా జాగ్రత్త.. మీరెక్కడ ఉన్నా లాక్కొచ్చి మరీ చంపేస్తారు.. అని కేశవరావు రాసిన లేఖ ఒకటి బలగాలకు దొరికింది. అందులో ఉన్నట్టుగానే.. లేటెస్ట్‌గా మరో కీలక నేత సుధాకర్‌ను సైతం ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి కోబ్రా టీమ్స్. ఇప్పటికే చావు భయంతో వందలాదిగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు. మిగిలిన వాళ్లు ఇలా ఎన్‌కౌంటర్లలో చనిపోతున్నారు. అయితే, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఒక్కడే ఇంకా చిక్కకుండా తిరుగుతున్నాడు. అతని కోసం వేట కొనసాగుతోంది.