Hyderabad Women Suicide : త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువతి.. ఫ్యాన్ కి శవమై వేలాడింది. రెండు నెలల్లో పచ్చని పందిరిలో పెళ్లి కూతురిలా ముస్తాబై కూర్చోవాల్సిన అమ్మాయి.. విగత జీవిగా మారిపోయింది. నెల క్రితమే నిశ్చితార్ధం కుదుర్చుకున్న కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైదరాబాద్ లోని అశోక్ నగర్ లోని గర్ల్స్ హాస్టల్ లో చోటుచేసుకోగా.. ఆత్మహత్య చేసుకున్న యువతిది కామారెడ్డిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రేణుక నాయక్ అనే 24 ఏళ్ల యువతి.. తానుంటున్న హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి వరకు అందరితో కలివిడిగా తిరిగిన యువతి.. ఏమైందో ఏమో కానీ.. తన గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
యువతి ఆత్మహత్యను పక్క గదిలోని స్నేహితురాళ్లు గమనించగా.. వారు సమాచారం అందించడంతో హాస్టల్ సిబ్బంది వచ్చి యువతిని కిందకి దించారు. కొన ఊపిరితో ఉన్న యువతిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక నాయక్ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుకగా గుర్తించారు.
కాగా.. రేణుక కు గత నెలలోనే నిశ్చితార్థం అవ్వగా.. ఫిబ్రవరి 7న పెళ్లి ముహుర్తం కూడా నిర్ణయించారు. ఈ సమయంలో ఇలా.. యువతి ఆత్మహత్యకు పాల్పడడంతో ఏమైందోనని పోలీసులు విచారణ ప్రారంభించారు.