TTD Update: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలో శ్రీవారి భక్తులకు కేవలం గంటలోగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చైర్మన్ తెలిపారు.
తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు రెండవ దఫా పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. మొదటి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ, రెండవ పాలకమండలి సమావేశంలోనూ భక్తులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
ప్రధానంగా తిరుమల కు వచ్చే భక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోగా దర్శనం కల్పించేందుకు అధ్యయనం చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఇప్పటికే 4 కంపెనీలు డెమో ఇచ్చాయని, ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతున్నట్లు చైర్మన్ అన్నారు. పాలకమండలి సమావేశం అనంతరం ఈవో శ్యామల రావు మాట్లాడుతూ.. టీటీడీ నిర్వహించే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచనలు చేసినట్లు, అందుకు తగిన విధంగా టీటీడీ తగిన కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.
స్విమ్స్ కు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. నడక మార్గంలో ఆరోగ్య సమస్యల కారణంగా మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలకు ప్రణాళిక రూపొందించామని ఈవో తెలిపారు. భక్తులకు అందించే సేవలపై ఫీడ్ బ్యాక్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు, అందుకై పాలకమండలిలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈవో అన్నారు. దేశంలోని ప్రతి రాజధానిలో టీటీడీ ఆలయాలను నిర్మించేందుకు పాలకమండలి నిర్ణయించింది.
Also Read: AP Govt: ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్..
ఈ నేపథ్యంలో ముంబైలో స్వామివారి ఆలయాన్ని 10 ఎకరాలు నిర్మించేందుకు టీటీడీ ముందడుగు వేస్తోంది. క్యూలైన్లో టాయిలెట్స్ కట్టాల్సిన అవసరం ఉందని, రూ. 3 కోట్లతో టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుమలలోని ఓ మఠానికి షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగిందని, ఇంకా ఆ మఠం నుండి తగిన సమాధానం రాలేదన్నారు. మఠం నుంచి బదులు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని శ్యామలరావు తెలిపారు.