రివ్యూ : ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ వెబ్ సిరీస్
ఓటీటీ ప్లాట్‌ఫాం: సోనీ లివ్
నటీనటులు: అమిత్ సియాల్ (డి.ఆర్. కార్తికేయన్), సాహిల్ వైద్ (అమిత్ వర్మ), బగవతి పెరుమాళ్ (రాఘోత్తం), షఫీక్ ముస్తఫా (శివరాసన్), దానిష్ ఇక్బాల్ (అమోద్ కాంత్), గిరీష్ శర్మ (రాధవినోద్ రాజు), విద్యుత్ గార్గ్ (రవీంద్రన్) తదితరులు
దర్శకత్వం : నాగేష్ కుకునూర్
రచన : నాగేష్ కుకునూర్, రోహిత్ బనావ్లికర్, శ్రీరామ్ రాజన్
ఎపిసోడ్‌లు: 7 (ఒక్కొక్కటి సుమారు 50-53 నిమిషాలు)
The Hunt – The Rajiv Gandhi Assassination Case Review in Telugu : ఇండియన్ హిస్టరీలో జరిగిన పెను విషాదాల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కూడా ఒకటి. అయితే అప్పట్లో ఆ హత్య కేసులో అసలు నిందితులను కేవలం 90 రోజుల్లోనే పట్టుకోవడం అన్నది మరో చరిత్ర. అలా రాజీవ్ హంతకుల వేట ఎలా సాగిందో కళ్లకు కట్టినట్టు చూపించడానికే ‘ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ అనే సిరీస్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా తెరకెక్కిన రాజకీయ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్”. తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ ఎల్టీటీఈ ఉగ్రవాది మానవ బాంబుగా మారి రాజీవ్ ను హత్యకు కారణం అవుతుంది. ఈ సిరీస్ లో సీబీఐ అధికారి డి.ఆర్. కార్తికేయన్ (అమిత్ సియాల్) నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) 90 రోజుల పాటు నడిపిన తీవ్రమైన దర్యాప్తును కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ హత్యకు బాధ్యత వహించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) నాయకుడు శివరాసన్ (షఫీక్ ముస్తఫా)ను కనుగొనే ప్రక్రియ, అసలు హత్య ఎలా జరిగింది? ఎవరు చేశారు? వారిని ఎలా పట్టుకున్నారు ? 90 రోజుల్లో కేసును ఎలా సాల్వ్ చేశారు? అనే ఇంట్రెస్టింగ్ అంశాలను తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
అనిరుద్య మిత్రా రాసిన “నైంటీ డేస్: ది ట్రూ స్టోరీ ఆఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీస్ అస్సాసిన్స్” ఆధారంగా తెరకెక్కింది ఈ సిరీస్. సాధారణంగా ఇలాంటి రియల్ స్టోరీలు తెరకెక్కించాలంటే ఎన్నో వివాదాస్పద అంశాలు, సున్నితమైన అంశాలను సృజించాల్సి ఉంటుంది. కాబట్టి దర్శకులకు అది కత్తిమీద సాము లాంటిది. కానీ తెలుగు దర్శకుడు నాగేష్ కుకునూరు ఆ డేరింగ్ స్టెప్ వేసి శభాష్ అనేలా సిరీస్ ను తెరకెక్కించారు. మొబైల్ ఫోన్‌లు, డిజిటల్ సర్వైలెన్స్ లేని 1991లో దర్యాప్తు ఎలా సాగిందన్న విధానాన్ని అద్భుతంగా చూపించారు. ల్యాండ్‌లైన్ ఫోన్‌లు, ఫైల్‌లు, స్థానిక ఇంటెలిజెన్స్‌పై ఆధారపడి జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఆకట్టుకుంటుంది.
ఎక్కువగా టైమ్ వేస్ట్ చేయకుండా రాజీవ్ గాంధీని కోల్పోయిన రోజు నుంచే కథను మొదలు పెట్టి, డైరెక్ట్ గా స్టోరీలోకి తీసుకెళ్లారు. కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ ఆఫీసుకు రాజీవ్ బ్రతికే ఉన్నారా ? అంటూ కాల్ రావడం, ఆ తరువాత రాజీవ్ ను ఓ మానవ బాంబు హత్య చేయడం, ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు, దీని వెనుక ఎల్టీటీఈ సంస్థ హ్యాండ్ ఉందని తేలడం, ఆ తరువాత హంతకుల వేట… ఇలా 7 ఎపిసోడ్లలో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా తెరకెక్కించారు. కేసు వెనుక ఉన్న రాజకీయ కుట్ర, సామాజిక సమస్యలను సున్నితంగా టచ్ చేస్తూనే, రాజీవ్ ను కాపాడడంలో జరిగిన పొరపాట్లు, చివరకు అసలైన హంతకుడిని పట్టుకోవడంలో జరిగిన ఫెయిల్యూర్ ను కూడా చూపించారు.
అయితే సిరీస్ మొదటి ఐదు ఎపిసోడ్‌లు ఉత్కంఠభరితంగా ఉన్నప్పటికీ, చివరి రెండు ఎపిసోడ్‌లలో దర్యాప్తు నెమ్మదిగా సాగడంతో, క్లైమాక్స్ లో ఇంపాక్ట్ తగ్గింది. అలాగే దీన్ని హిస్టారికల్ ఎపిక్ గా కాకుండా, కేవలం ఇన్వెస్టిగేషన్ పైనే ఫోకస్ పెట్టారు. కాబట్టి ఎక్కడా సిట్, LTTE ఆపరేటివ్‌ల పర్సనల్ విషయాలను టచ్ చేయలేదు. కొన్ని సన్నివేశాల్లో సెన్సార్‌షిప్ జోక్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా హత్యకు ముందు రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు వంటి విషయాలను చూపించలేదు. కాబట్టి పూర్తిగా విషయం తెలియని ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం కష్టం. ఏదేమైనా డైరెక్షన్, విజువల్స్, నిర్మాణ విలువలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
అమిత్ సియాల్ డి.ఆర్. కార్తికేయన్‌గా అదరగొట్టాడు. సాహిల్ వైద్ (అమిత్ వర్మ), బగవతి పెరుమాళ్ (రాఘోత్తం), షఫీక్ ముస్తఫా (సివరాసన్)గా కూడా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా ఫరవాలేదు అన్పించారు.
ప్లస్ పాయింట్స్
నటన
అథెంటిక్ నిర్మాణం
దర్శకత్వం- రచన
ప్రీ-ఇంటర్నెట్ ఇన్వెస్టిగేషన్
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే క్లైమాక్స్
చివరి రెండు ఎపిసోడ్లు
మొత్తంగా
ఈ వీకెండ్ కు మస్ట్ వాచ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.
The Hunt – The Rajiv Gandhi Assassination Case Rating : 2.5/5