Kadapa Accident: కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు మండలంలోని పాలెంపల్లె వద్ద రెండు కార్లు ఎదురెదురుగా అత్యంత వేగంతో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిందిలా..
హైదరాబాద్ నుండి తిరుపతి వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు, అలాగే తిరుపతి నుండి హైదరాబాద్ వైపు వస్తున్న ఎర్టిగా కారు చెన్నూరు పరిధిలోని పాలెంపల్లె వద్దకు రాగానే ఊహించని విధంగా ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు స్విఫ్ట్ కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
Also Read: నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ముగ్గురు అక్కడికక్కడే మృతి
ఈ భీకర ప్రమాదంలో స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. మృతులను తిరుపతిలోని జీవకోన ప్రాంతానికి చెందిన హర్షవర్ధన్, కిషోర్, సాయి సుధీర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో జీవకోనలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ముగ్గురికి తీవ్ర గాయాలు
మరోవైపు, ఎర్టిగా కారులో తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న ముగ్గురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రమాద స్థలానికి చేరుకున్న చెన్నూరు పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. అనంతరం రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.