Train Ticket Price in 1947 vs 2026: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో 1947లో ఉన్న పరిస్థితులను ఈ రోజులతో పోల్చుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా అప్పటి రైలు టికెట్ ధరలు, పెట్రోల్, బంగారం వంటి వాటి ధరలను ఇప్పుడు ఉన్న ధరలతో పోలిస్తే దేశంలో గత ఎనిమిది దశాబ్దాల్లో వచ్చిన మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది.
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో రైలు ప్రయాణం ఇప్పటిలా ఉండేది కాదు. ఆవిరి ఇంజన్లు, పాతకాలపు బోగీలతో రైళ్లు నడిచేవి. అయినప్పటికీ అప్పట్లో సుదూర ప్రయాణాలకు రైల్వే ప్రధాన రవాణా మార్గంగా ఉండేది. 1947లో ఢిల్లీ నుంచి ముంబైకి ఫస్ట్ క్లాస్ రైలు టికెట్ సుమారు రూ.90 నుంచి రూ.140 మధ్య ఉండేదని ఆధారాలు చెప్తున్నాయి. రైలు, ప్రయాణ తేదీ, సర్వీసును బట్టి ఛార్జీలో కొంత తేడా ఉండేది. తక్కువ దూరాలకు, తక్కువ తరగతి ప్రయాణాలకు మాత్రం తక్కువ ధరలో టికెట్లు లభించేవి.
తాజాగా ఆ కాలానికి చెందిన ఓ పాత రైలు టికెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1947 సెప్టెంబర్ 17న రావల్పిండి నుంచి అమృత్ సర్ కు తొమ్మిది మంది ప్రయాణికులు చేసిన ప్రయాణానికి సంబంధించిన ఆ టికెట్ ధర రూ.36, 9 అణాలుగా ఉన్నట్లు అందులో రాసి ఉంది. అప్పటి పరిస్థితులను గుర్తు చేసే అరుదైన ఆధారంగా ఈ టికెట్‌ను చాలామంది ఆసక్తిగా చూశారు.
ఇక 2026లో ఢిల్లీ నుంచి ముంబైకి రైలు ప్రయాణం చేయాలంటే తరగతిని బట్టి వందల నుంచి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. స్లీపర్ క్లాస్ ఛార్జీలు సుమారు రూ.605 నుంచి ప్రారంభమవుతుండగా, 3AC టికెట్ దాదాపు రూ.1,165 నుంచి ఉంటుంది. 3AC ఎకానమీ ఛార్జీలు సుమారు రూ.1,525 నుంచి, 2AC టికెట్లు రూ.2,320 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ AC టికెట్ అయితే సుమారు రూ.3,890 వరకు ఉండొచ్చు. రైలు, తేదీ, కోటా, ఇతర ఛార్జీలను బట్టి ధరలు మారవచ్చు.
విమాన ప్రయాణం కూడా అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగింది. 1947లో ఢిల్లీ-ముంబై విమాన టికెట్ సుమారు రూ.140 ఉండేదని వివరాలు చెబుతున్నాయి. ఇప్పుడు అదే మార్గంలో ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే ఎకానమీ క్లాస్‌కు సుమారు రూ.4,900 నుంచి రూ.6,500 వరకు ఖర్చవుతుంది.
రైలు, విమాన ఛార్జీలతో పాటు పెట్రోల్, బంగారం ధరల్లోనూ భారీ మార్పు వచ్చింది. స్వాతంత్ర్యం సమయంలో పెట్రోల్ ధర లీటరుకు 30 పైసల కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102కు పైగా, ముంబైలో రూ.111కు పైగా ఉంది. 1947లో 10 గ్రాముల బంగారం సుమారు రూ.88.62 ఉండగా, ఇప్పుడు అదే పరిమాణం బంగారం ధర లక్షన్నర రూపాయలకు పైగా ఉంది. 1947 నుంచి 2026 వరకు రైలు టికెట్ ధరల మార్పు కేవలం ప్రయాణ ఖర్చు పెరిగిందనే విషయం మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగం, సాంకేతికత, ప్రజల జీవన విధానం ఎంతగా మారాయో చెప్పే ఉదాహరణగా చూడొచ్చు.
Read Also: వినాయక చవితికి 254 స్పెషల్ రైళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే?