2006-07 మధ్యలో వరుసగా హత్యలతో ఢిల్లీని వణికించి కరుడుగట్టిన హంతకుడు చంద్రకాంత్ ఝా(57) పోలీసులకు దొరికాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉండగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పెరోల్ మీద బయటకు వచ్చి, మళ్లీ కోర్టులో లొంగిపోకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. తాజాగా అతడిని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు.
ఏడాదిలో 18 మంది దారుణ హత్య
ఏడాది కాలంలో ఏకంగా 18 మందిని దారుణంగా చంపి పోలీసులకే సవాల్ విసిరాడు చంద్రకాంత్ ఝా. ఒక్కొక్కరిని చంపి దేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఢిల్లీలో పలు చోట్ల పడేసేవాడు. ముఖ్యమైన భాగాలను ప్లాస్టిక్ సంచిలో చుట్టి తీహార్ జైలు సమీపంలో వేసే వాడు. “ఈ హత్య నేనే చేశాను. చేతనైతే పట్టుకోండి” అంటూ చీటీ రాసి పెట్టేవాడు. అంతేకాదు.. తీహార్ జైలు సమీపంలో డెడ్ బాడీ ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చేవాడు. ఇతడిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి, చివరకు రెస్ట్ చేశారు. ఈ హత్యల్లో మూడు కేసులకు సంబంధించి నేరం రుజువు అయ్యింది. కోర్టు రెండు మరణశిక్షలు విధించింది. కానీ, 2016లో విడుదలకు అవకాశం లేని యావజ్జీవ కారాగారశిక్షలుగా మార్చుతూ క్షమాభిక్ష లభించింది.
2023లో చంద్రకాంత్ కు 90 రోజుల పెరోల్
ఈ దారుణ హంతకుడికి 2023లో 90 రోజుల పాటు పెరోల్ లభించింది. తన ఫ్యామిలీలో ఒక్కడినే పురుషుడినని, తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని కోర్టులో కేసు వేశాడు. ఒక తండ్రిగా తన బిడ్డల పెళ్లి చేసే బాధ్యత తన మీద ఉందన్నారు. అమ్మాయి పెళ్లి కోసం తనను బయటకు పంపించాలని కోర్డును రిక్వెస్ట్ చేశారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. రూ. 25 వేల పూచీకత్తు, రెండు బెయిల్ బాండ్లను సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత చంద్రకాంత్ కు పెరోల్ ఇచ్చింది. అయితే, చంద్రకాంత్ పెరోల్ ముగిసిన తర్వాత కూడా తిరిగి కోర్టులో లొంగిపోలేదు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. గత కొద్ది రోజులుగా ఆయనను పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. అయినప్పటికీ, ఎలాంటి ఆచూకీ లభించలేదు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Read Also: ప్రియుడిని చంపేసిన ప్రియురాలు.. ఉరి శిక్ష విధించిన కోర్డు!
సీరియల్ హంతకుడిపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ
ఢిల్లీని వణికించిన చంద్రకాంత్ ఝా మీద ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘ఇండియన్ ప్రిడేటర్ : ది బుచర్ ఆఫ్ ఢిల్లీ’ పేరుతో ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అక్టోబర్ 20, 2006లో చంద్రకాంత్ తొలి హత్య చేశాడు. ఆ తర్వాత వరుస హత్యలు చేయడం మొదలుపెట్టాడు. అతడు టార్గెట్ చేసిన వ్యక్తులను ముక్కలు ముక్కలుగా నరికి తీహార్ జైలు సమీపంలో పడేసేవాడు. దమ్ముంటే తనను పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరేవాడు. చివరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పెరోల్ తర్వాత మళ్లీ పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ దెబ్బతో చంద్రకాంత్ మళ్లీ బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Read Also: నన్నెందుకు కన్నావు? తనకు జన్మనిచ్చిందని.. తల్లిని కడతేర్చిన కొడుకు!