Sharon Raj Murder Case: కేరళలో సంచలనం రేపిన షారోన్ రాజ్ మర్డర్ కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్షను ఖరారు చేసింది నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు. ఈ హత్యలో గ్రీష్మకు సాయం చేసిన ఆమె మామ నిర్మలా కుమారన్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అటు ఈ కేసులో A2గా ఉన్న గ్రీష్మ తల్లిని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది.
నిందితురాలు ప్రేమించిన వ్యక్తిని మోసం చేసింది!
ఈ కేసు తీర్పు సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితురాలు ప్రేమించిన వ్యక్తిని మోసం చేసిందని అభిప్రాయపడింది. ఆమె చేసిన పని సమాజానికి చెడు సందేశం ఇచ్చేలా ఉందని తెలిపింది. ఇదో అరుదైన కేసుగా అభిప్రాయపడిన న్యాయస్థానం, ఆమె వయసును పరిగణలోకి తీసుకోకుండా ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పుతో గ్రీష్మ కోర్టులో కుప్పకూలిపోయినట్లు తెలుస్తున్నది. మరోవైపు ఈ కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులను న్యాయస్థానం ప్రశంసించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు 586 పేజీల తీర్పు వెల్లడించింది.
ఇంతకీ ఏంటీ షారోన్ రాజ్ మర్డర్ కేసు?
కేరళకు చెందిన షారోన్, గ్రీష్మా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చాలా కాలం ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే, ఆ అమ్మాయి షారోన్ ని వదిలించుకుని మరో వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంది. షారోన్ ను దూరం పెట్టే ప్రయత్నం చేసింది. అయితే, షారోన్ తన నుంచి విడిపోయేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా అతడిని అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. 2022 అక్టోబర్ 14న షారోన్ రాజ్ ను అతడి ప్రియురాలు గ్రీష్మ తన ఇంటికి పిలిచింది. తన పుట్టిన రోజు కావడంతో చీరాలోని పార్టీకి పిలిచింది. ఇంటికి వచ్చిన ప్రియుడికి విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ డ్రింక్ తీసుకున్న షారోన్.. నెమ్మదిగా అపస్మారక స్థితిలోకి చేరాడు. హాస్పిటల్ లో చేరి సుమారు 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. అక్టోబర్ 25న చనిపోయాడు. వైద్య పరీక్షల్లో కూల్ డ్రింక్ లో గ్రీష్మ విషం కలిపినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.
శరవేగంగా కేసు విచారణ పూర్తి!
షారోన్ మర్డర్ కేసును పోలీసులు కీలకంగా తీసుకున్నారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. శరవేగంగా ఈ కేసును ఇన్వేస్టిగేషన్ చేశారు. గ్రీష్మ నేరస్తురాలు అని తేల్చేందుకు అన్ని సాక్ష్యాలు సేకరించారు. గత ఏడాది అక్టోబర్ 15న ప్రారంభమైన ఈ కేసు విచారణ ఈ ఏడాది జనవరి 3తో ముగిసింది. ఈ కేసులో సుమారు 100 మంది సాక్ష్యులను విచారించారు. జనవరి 17న ఇరు వాదానలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గ్రీష్మను దోషిగా తేల్చింది. యువకుడిని ప్లాన్ ప్రకారం హత్య చేసిన ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. ఈ హత్యలో ఆమెకు సహకరించిన మామ నిర్మల కుమార్ కు 3 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
Read Also: లోపల ప్రియురాలి పెళ్లి, బయట ప్రియుడి సజీవదహనం.. ఇంతకీ హత్యా? ఆత్మహత్యా?