Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు రమేష్, అనూష, మనీష్, మణీత్వాగా గుర్తించారు పోలీసులు. బెంగళూరులోని హిందుస్తాన్ ప్రైవేటు కంపెనీలో రమేష్ బాబు జాబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెన ట్రిప్పులో భాగంగా కుటుంబ సభ్యులతో హైదరాబాద్ కు రమేష్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో రమేష్ స్వస్థలం అయిన నెల్లూరు జిల్లా గింజమూరు మండలం గొల్లవారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సులో మొత్తం 43 మంది ఉండగా.. అందులో 23 మంది సజీవ దహనం అయ్యారు.
ఇక తాజాగా కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. దగ్ధమైన బస్సులో 19 మృతదేహాలను గుర్తించి వాటిని వెలికితీసారు ఫోరెన్సిక్ బృందాలు.
ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు.
Also Read: కర్నూల్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా
మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.